జీపై రిలయన్స్ జియో కన్ను

జీపై రిలయన్స్ జియో కన్ను

భారత కుబేరులు ముకేష్ అంబానీ, సునీల్ భారతి మిట్టల్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న జీ టెలివిజన్ నెట్ వర్క్ లో వాటా కోసం పోటీ పడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ లో తమ టెలికామ్ కంపెనీలకు కంటెంట్ సాధించుకొనేందుకు ఇరువురు రంగంలోకి దిగినట్టు తెలిసింది.

మిట్టల్ కి చెందిన భారతి ఎయిర్ టెల్ లిమిటెడ్ ఇప్పటికే ఎంతో శ్రద్ధగా జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ వ్యవహారాలను పరిశీలిస్తోందని, త్వరలోనే అధికారిక ప్రతిపాదన ముందుంచనున్నట్టు చెబుతున్నారు. అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కూడా బిడ్ వేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని, ఈ వ్యవహారం ముగించేందుకు త్వరపడటం లేదని ఈ విషయంపై వివరాలు తెలిసినవాళ్లు అంటున్నారు.

ఈ ఊహాగానాలపై తాము ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించబోమని జీ ప్రతినిధి చెప్పారు. అయితే సంభావ్య భాగస్వాములతో స్థిరమైన చర్చలు జరుగుతున్నాయన్నారు. అయితే ఈ వ్యవహారంపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారతి ఎలాంటి వివరణలు ఇవ్వలేదు. 

ఈ ఏడాది 5జి ఎయిర్ వేవ్స్ ని ప్రభుత్వం వేలం వేసేందుకు సిద్ధమవుతుండటంతో ఈ ఒప్పందం కుదిరితే బిడ్ నెగ్గినవారికి భారీగా వీడియో సేవలు అందించడం ద్వారా ఆదాయం ఆర్జించే మార్గం ఏర్పడుతుంది. వినియోగదారుల సంఖ్య తగ్గుతుండటంతో ఆదాయాలు పెంచుకొనేందుకు ఏటీ&టీ ఇంక్., వోడాఫోన్ గ్రూప్ పీఎల్సీ, కేడీడీఐ కార్ప్ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్ కంపెనీలు ఫిలిం, టెలివిజన్ ప్రొడక్షన్, కేబుల్ టీవీ ఆస్తులను కొనుగోలు చేస్తున్నాయి. 

ఇలాంటి ఆస్తుల కొనుగోలుతో సర్వీస్ ప్రొవైడర్లు తామే కంటెంట్ తయారుచేసి ఇంటర్నెట్ ద్వారా వినియోగదారులకు అందించడం వీలవుతుంది. తద్వారా నెట్ ఫ్లిక్స్ ఇంక్., అమెజాన్.కామ్ ఇంక్.కి చెందిన ప్రైమ్ సర్వీస్ లతో పోటీ పడవచ్చు.