ఇండియన్‌ అలీబాబా...అంబానీ కొత్త ప్లాన్ !

ఇండియన్‌ అలీబాబా...అంబానీ కొత్త ప్లాన్ !

రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ చైనా దిగ్గజం అలీబాబాగా గ్రూప్ మాదిరిగా డిజిట‌ల్ స‌ర్వీసెస్ కంపెనీని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రిల‌య‌న్స్ ఇండ‌స్ర్టీస్, జియోతో పాటు అన్ని డిజిట‌ల్ విభాగాల‌ను ఒక్క చోట చేర్చి ఒక కొత్త పేరుతో సమీకరించనున్నట్టు చెబుతున్నారు. చైనా సంస్థ అలీబాబా కంపెనీ ఇ-కామ‌ర్స్, రిటైల్‌, ఇంట‌ర్నెట్‌, టెక్నాల‌జీ ఇలా అన్ని విభాగాల‌ను క‌లిగి ఉన్నట్టే రిల‌య‌న్స్ కూడా కొత్త అనుబంధ సంస్థతో అన్నింటిని ఒకే గూటికి తీసుకురానుందని అంటున్నారు.

దీనికోసం రూ.1,08,000 కోట్లతో ఒక పూర్తిస్థాయి సంస్థను ఏర్పాటు చేయ‌నుందని సమాచారం. దీంతో దేశంలోనే అతిపెద్ద డిజిట‌ల్ సంస్థగా మా అనుబంధ సంస్థ ఏర్పడ‌నుందని రిల‌య‌న్స్ పేర్కొంది. ఈ డిజిట‌ల్‌ అనుబంధ సంస్థ ఏర్పాటుకు రిల‌య‌న్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. రిల‌య‌న్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌లో రిల‌య‌న్స్ పెట్టిన రూ.65,000 కోట్ల ఈక్విటీ కూడా ఇందులోకే వెళ్ల‌నుంది. దీంతో సంస్థ మొత్తం మూల‌ధ‌న విలువ రూ.1,73,000 కోట్లకు చేర‌నుంది.