దక్షిణ ముంబై కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో ముకేష్ అంబానీ

దక్షిణ ముంబై కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో ముకేష్ అంబానీ

లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ముంబై నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్న మిలింద్ దేవరా ఒక వీడియోని ట్వీట్ చేశారు. ఈ వీడియోలో సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు అంతా దక్షిణ ముంబైకి మిలింద్ దేవరా ఒక్కడే అత్యుత్తమ అభ్యర్థి అని పేర్కొన్నారు.

మిలింద్ దేవరా ట్వీట్ చేసిన వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, కోటక్ మహీంద్ర గ్రూప్ యజమాని ఉదయ్ కోటక్ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. వీళ్లతో పాటు ఎందరో చిరు వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా మిలింద్ కు తమ మద్దతు తెలియజేశారు.

వీడియో ట్వీట్ చేస్తూ మిలింద్ దేవరా దక్షిణ ముంబై అంటే బిజినెస్ అని రాశారు. దాంతో పాటే ప్రజలు నన్ను గెలిపిస్తే యువకులకు ఉద్యోగావకాశాలు తెస్తాను. యువతకు ఉద్యోగాలివ్వడం నా మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్ లో ముకేష్ అంబానీ 'మిలింద్ ఈజ్ ద మ్యాన్ ఫర్ సౌత్ ముంబై (దక్షిణ ముంబైకి మిలింద్ దేవరాయే సరైనోడు)' అని చెబుతున్నారు. అతను పదేళ్లుగా ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నాడని ముకేష్ అంబానీ చెప్పారు. మిలింద్ కు అనేక అంశాలపై మంచి అవగాహన ఉందని నేను నమ్ముతున్నాను. అతను యువతకు ఉద్యోగావకాశాలు వెతకగలడు' అని అంటున్నారు.

మరోవైపు ఉదయ్ కోటక్ ' మిలింద్ ట్రూలీ రిప్రజెంట్ (మిలింద్ సరైన విధంగా ప్రాతినిధ్యం వహిస్తారు). అతనిపై నాకు నమ్మకం ఉంది. మిలింద్ కు అనేక విషయాలపై బాగా అవగాహన ఉందని నేను భావిస్తాను. అతను అంశాలను బాగా అర్థం చేసుకుంటాడు' అని చెప్పారు.

ముకేష్ అంబానీ, మిలింద్ దేవరా కుటుంబాల మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. బహుశా ఇదే కారణంగా ముకేష్ అతని ప్రచార వీడియోలో కనిపించారు. దేవరా గత పదేళ్లుగా ఎంపీగా ఉన్నారు. అతను యుపిఏ సర్కార్ లో మంత్రిగా కూడా పనిచేశారు.