ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్

ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్

సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ను సోమవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు ఘాజియాబాద్ లోని కౌశంబీ ప్రాంతంలో ఉన్న యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మూత్ర సంబంధ అనారోగ్యానికి చికిత్స చేస్తున్నారు. ఎస్పీ మాజీ అధ్యక్షుడు, మెయిన్ పురీ ఎంపీ అయిన ములాయం ను ఈ మధ్యాహ్నం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన వెంట మరో ఎస్పీ నేత, బదౌన్ మాజీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ఉన్నట్టు తెలిసింది. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూన్ 10న ములాయంను గుర్గావ్ లోని మేదాంతా ఆస్పత్రిలో చేర్పించారు. నిన్ననే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి చేరారు. 

ములాయం సింగ్ యాదవ్ సుదీర్ఘ కాలంగా హై షుగర్, కార్డియో, హైపర్ టెన్షన్ సమస్యలతో బాధపడుతున్నారు. కొత్త కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పార్లమెంట్ సమావేశాల రెండో రోజు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ప్రమాణం చేశారు. చాలా రోజులుగా అస్వస్థులుగా ఉన్న ములాయం, ప్రమాణం చేసేందుకు వెల్ దాకా కూడా రాలేకపోయారు. ఆయన వెనుక సీటు దగ్గర నిలబడి ప్రమాణం చేశారు. ములాయం సభకు వీల్ ఛెయిర్ లో కూర్చొని వచ్చారు. వీల్ ఛెయిర్ లో కూర్చోబెట్టి అఖిలేష్ ఆయనను పార్లమెంట్ కి తెచ్చారు.