రివ్యూ : ముల్క్

 రివ్యూ : ముల్క్

నటీనటులు : రిషి కపూర్, తాప్సి పన్ను, ప్రతీక్ బబ్బర్, రజత్ కపూర్, అసుతోష్ రానా, మనోజ్ పహ్వ, నీనా గుప్త

మ్యూజిక్ : ప్రసాద్ సస్తే, అనురాగ్ సైకియా  

ఫోటోగ్రఫి : ఇవాన్ ముల్లిగన్  

నిర్మాత : దీపక్ ముక్త్, అనుభవ్ సిన్హా  

దర్శకత్వం : అనుభవ్ సిన్హా  

రిలీజ్ డేట్ : 03-08-2018

రిషి కపూర్, తాప్సి పన్ను, ప్రతీక్ బబ్బర్, రజత్ కపూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందిన బాలీవుడ్ చిత్రం 'ముల్క్'.  ట్రైలర్ తో వైబ్రేషన్స్ క్రియేట్ చేసి చర్చనీయాంశమైన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది.  మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. 

కథ: 

హిందువుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న వారణాసి ప్రాంతంలో మురద్ అలీ మహమ్మద్ (రిషి కపూర్) తాన్ కుటుంబంతో జీవిస్తుంటాడు.  వృత్తి రీత్యా న్యాయవాది అయిన మురద్ అన్నింటిలోనూ  హిందూ, ముస్లింలు సమానమని గట్టిగా నమ్మే వ్యక్తి.  అలాంటి సమయంలో అతని సోదరుడి కుమారుడు షాహిద్ తీవ్రవాది అని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అతన్ని కాల్చి చంపేస్తుంది.  అలాగే అతని తండ్రి బిలాల్ ని కూడ అరెస్ట్ చేస్తుంది.  దీంతో మురద్ అతనికి సోదరుడి తరపున న్యాయం కోసం పోరాటం ప్రారంబిస్తాడు.  ఆ తర్వాత పోలీసులు అతన్ని కూడ కేసులోకి లాగుతారు.  ఇక ఆయన కోడలు ఆర్తి  మహమ్మద్ (తాప్సి) ఆ కేసును టేకప్ చేసి పోరాటం మొదలుపెడుతుంది.  స్వతహాగా హిందువు అయిన ఆర్తి ఎలా ఈ కేసులో గెలిచింది, తన వాళ్ళను నిర్దోషులని ఎలా నిరూపించింది అనేదే సినిమా. 

విశ్లేషణ : 

మొదటి అర్ధభాగం మొత్తం ఫ్యామిలీ డ్రామాగా నడిచిన ఈ చిత్రం ద్వితీయార్థంలో బాగా రక్తి కట్టింది.  అందులో వచ్చే కోర్ట్ రూమ్ డ్రామా చాలా బాగా పండింది.  ఎక్కువగా టెర్రరిజం నైపథ్యంలోనే ఈ సినిమా నడవడం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.  భారతీయ సమాజాన్ని లోతుగా చూపించిన ఈ చిత్రం అసలు టెర్రరిజం పుట్టడానికి ఈ మతం ఎంతవరకు కారణమవుతుందో వివరించింది.  ఒక భాద్యత కలిగిన న్యాయవాదిగా, భాధను కలిగిన కుటుంబ సభ్యురాలిగా ఆర్తి మహమ్మద్ పాత్రను బాగానే డిజైన్ చేశారు.  కుటుంబంలో ఒక్కడు టెర్రరిస్ట్ అయినంత మాత్రాన మొత్తం కుటుంబాన్నే నిందించడం, దేశం నుండి బహిష్కరించాలని అనుకోవడం సమంజసం కాదని, టెర్రరిజాన్ని మూలం కుటుంబాలు కాదని దర్శకుడు అనుభవ్ సిన్హా వివరించిన తీరు చాలా బాగుంది. 

నటీనటుల పనితీరు :

రిషి కపూర్ మురద్ పాత్రలో అదిరిపోయే నటనను కనబర్చారు.  భాధ, భాద్యత, కోపం, ప్రేమ వంటి ఎమోషన్స్ ను మనసుకు తాకేలా పలికించారాయన.  ఇక కోడలి పాత్రలో తాప్సి ఒకవైపు భాధను పలికిస్తూనే మరోవైపు లాయర్ గా తెలివిగా వాదించడం ఆకట్టుకుంది.  నీనా గుప్త, ప్రతీక్ బబ్బర్, రజత్ కపూర్, అసుతోష్ రానాలు తమ తమ పాత్రలకు సరైన న్యాయం చేయగా మనోజ్ పహ్వ తన కామెడీతో బాగా నవ్వించారు.  

సాంకేతిక విభాగం :

దర్శకుడు అనుభవ్ సిన్హా తన కథతో టెర్రరిజాన్ని కుటుంబాలు మూలం కాదని, దానికి మతం వంటి ఇతర కారణాలున్నాయని, సమాజంలో అందరూ సమానమేనని, కొందరిపై పాటిగట్టుకుని విలక్ష చూపడం భావ్యం కాదని బల్లగుద్ది చెప్పారు.   ప్రసాద్ సస్తే, అనురాగ్ సైకియాల సంగీతం పర్వాలేదనిపించగా ఇవాన్ ముల్లిగన్ సినిమాటోగ్రఫీ వారణాసి వైభవాన్ని, వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపింది. 

పాజిటివ్ పాయింట్స్ : 

కథ 

దర్శకత్వం 

కోర్ట్ రూమ్ సన్నివేశాలు 

రిషి కపూర్, తాప్సిల నటన

మనోజ్ పహ్వ కామెడీ 

మైనస్ పాయింట్స్ :

బలహీనమైన ట్విస్టులు 

సరైన సంగీతం లేకపోవడం 

చివరగా : కనువిప్పు కలిగించే చిత్రం