కేజ్రీవాల్ భార్య దగ్గర రెండు ఓటర్ ఐడీలు!!

కేజ్రీవాల్ భార్య దగ్గర రెండు ఓటర్ ఐడీలు!!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కి రెండు ఓటర్ ఐడీలు ఉన్నాయనే ఫిర్యాదుపై ఢిల్లీలోని ఒక కోర్టు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘాలకు బుధవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీలో బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖురానా దాఖలు చేసిన ఒక ఫిర్యాదును విచారిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ షెఫాలీ బర్నాలా టండన్ యుపి, ఢిల్లీ రాష్ట్ర ఎలక్షన్ కమిసన్లకు చెందిన అధీకృత అధికారులకు సమన్లు జారీ చేస్తూ సునీతా కేజ్రీవాల్ కి సంబంధించిన అన్ని చట్టబద్ధమైన రికార్డులను సమర్పించాల్సిందిగా ఆదేశించారు. 


కోర్టు ఈ కేసుపై జూన్ 3న విచారణ చేపడుతుంది. ఖురానా ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పై ఒక అధికారిక కేసు నమోదు చేశారు. అందులో ఆమె దగ్గర రెండు ఓటర్ ఐడీలు ఉన్నట్టు ఆరోపించారు. ఒక ఓటర్ ఐడీ ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధికి చెందినది, రెండోది చాందినీ చౌక్ ప్రాంతానికి చెందినది.

'ఆమ్ ఆద్మీ పార్టీకి తప్పుడు పద్ధతుల్లో ప్రయోజనం చేకూర్చేందుకు సునీతా ఎన్నికల ప్రక్రియను, నిబంధనలను పూర్తిగా అవహేళన చేశారు. ఆమె ఉద్దేశపూర్వకంగా రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఓటర్ల జాబితాలో తన పేరును కొనసాగించారని' ఖురానా తన పిటిషన్ లో ఆరోపించారు.