ప్లేఆఫ్స్‌కు చేరిన ముంబై ఇండియన్స్‌

ప్లేఆఫ్స్‌కు చేరిన ముంబై ఇండియన్స్‌

ముంబై ఇండియన్స్‌ 'ప్లే ఆఫ్‌' దశకు అర్హత సంపాదించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సూపర్‌ ఓవర్లో బోర్లా పడింది. మ్యాచ్‌ టైగా ముగియగా.. సూపర్‌ ఓవర్లో ముంబై మెరిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.  58 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 69 పరుగులు చేసి డికాక్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (24) ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సూర్యకుమార్‌(23), ఎవిన్‌లెవిస్‌(1) హార్దిక్‌ పాండ్య (11), పొలార్డ్‌ (10) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా మరో ఎండ్‌లో డికాక్‌ ఒంటరి పోరాటం చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. రైజర్స్ బౌలింగ్‌లో ఖలీల్ 3, నబీ, భువనేశ్వర్ తలో వికెట్ తీశారు.

163 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన హైదరాబాద్‌ జట్టులో ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించారు. తొలి ఓవర్లో సాహా, రెండో ఓవర్లో గప్టిల్‌ బౌండరీ కొట్టారు. మూడో ఓవర్లో  17 పరుగులు రాబట్టారు. నాలుగో ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన సాహా (15 బంతుల్లో 25; 5 ఫోర్లు) ఆఖరి బంతికి  ఔటయ్యాడు. మరికాసేపటికి గప్టిల్‌ను (11 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్‌) ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. వెనక్కిపంపాడు. గప్టిల్‌ రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ (3) తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. ఆ తర్వాత విజయ్‌ శంకర్‌ (12), అభిషేక్‌ శర్మ (2) వెనువెంటనే పెవిలియన్‌ చేరారు. వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో మనీష్‌పాండే ఫోర్లు, సిక్సర్లతో స్కోర్‌బోర్డును పరిగెత్తించాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 17 పరుగులు అవసరమవగా.. 16 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. సూపర్‌ ఓవర్‌లో హైదరాబాద్‌ మొదటి నాలుగు బంతుల్లో 2 వికెట్లను కోల్పోయి 8 పరుగులు చేయగా... ముంబై 3 బంతుల్లోనే 9 పరుగులు చేసి గెలిచింది.