సస్పెన్షన్ తో నా ప్రదర్శన మరింత మెరుగైంది

సస్పెన్షన్ తో నా ప్రదర్శన మరింత మెరుగైంది

ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్‌గా హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాడు. బౌలింగ్ లో అంతంత మాత్రంగా ఉన్నా.. బ్యాటింగ్‌లో మాత్రం చెలరేగిపోతున్నాడు. ప్రధానంగా తన పవర్‌ బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాడు‌. సోమవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో ముంబయి జట్టు మరో ఓవర్‌ ఉండగానే విజయం సాధించింది. చివరి రెండు ఓవర్లలో ముంబయి 22 పరుగులు చేయాల్సిన తరుణంలో హార్దిక్‌ 19వ ఓవర్‌లోనే ఆ పరుగులు సాధించి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

సోమవారం జరిగిన మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ.. 'ప్రతీ ఒక్కరి జీవితంలో కష్టకాలం అనేది ఉంటుంది. అలానే నా జీవితంలో కూడా చోటు చేసుకుంది. నాపై సస్పెన్షన్‌ విధించడంతో చాలా బాధపడ్డా. చాలా రోజులు ఇంట్లోనే ఉండి కుమిలిపోయా. ఇదే నా ప్రదర్శన మెరుగు పడటానికి కారణమైంది. నా ఫిట్‌నెస్‌‌తో పాటు ఆటపై మరింత దృష్టి పెట్టడానికి కారణమైంది' అని పాండ్యా తెలిపాడు.

"కాఫీ విత్ కరణ్" కార్యక్రమంలో మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, లోకేశ్‌ రాహుల్‌లపై బీసీసీఐ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో వారిపై నిరవధిక నిషేధం విధించారు. వీరిద్దరు బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో వారి కెరీర్‌లను దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.