ఉత్కంఠ పోరులో నాల్గోసారి టైటిల్‌ కైవసం..

ఉత్కంఠ పోరులో నాల్గోసారి టైటిల్‌ కైవసం..

హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియం వేదికగా ఉత్కంఠ బరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలో నాల్గోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది ముంబై ఇండియన్స్ జట్టు... ఈ టోర్నీలో ఫైనల్‌ చేరే క్రమంలో మూడుసార్లు చెన్నైని మట్టికరిపించిన ముంబై... ఆఖరి పోరాటంలో విజయం సాధించింది. ఉత్కంఠ, ఉద్వేగాలను పెంచేసి, ఆఖరి బంతి వరకూ అభిమానులను ఉక్కిరిబిక్కిరికి గురిచేసి ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను  ఓడించిన ముంబై.. నాల్గోసారి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. దీంతో అత్యధికసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన జట్టుగా కొత్త రికార్డు నెలకొల్పింది. 

ముంబై ఇండియన్స్ జట్టు 2013, 2015, 2017తో పాటు 2019 సీజన్‌ ట్రోఫీని కూడా ఎగరేసుకుపోయింది. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా అవతరించింది. ఇక 2009లో డెక్కన్‌ ఛార్జర్స్‌ (డీసీ) తరఫున కప్‌ అందుకున్న రోహిత్‌శర్మ.. ఐదోసారి ఐపీఎల్‌ ట్రోఫీ అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా, ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌-12 ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి149 పరుగులు సాధించింది. కీరన్‌ పొలార్డ్‌ 41 (నాటౌట్‌), డికాక్‌ 29, రోహిత్‌ 15, సూర్యకుమార్‌ 15, ఇషాన్‌ 23, కృనాల్‌ 7, హార్దిక్‌ 16 పరుగులు చేశారు. ఇక అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ 80.. పోరాడినా చివరి మెట్టుపై చతికిలపడ్డాడు. 150 పరుగుల టార్గెట్ పెద్దది కాకపోయినా ముంబై బౌలర్ల దాటికి ఓపెనర్లు వాట్సన్‌, డుప్లెసిస్‌ వేగంగా పరుగులు రాబట్టినా పట్టు వీడలేదు. చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన మలింగ ముంబైకి హీరోగా నిలిచాడు కానీ.. అంతకుముందు ఆ జట్టును పోటీలో నిలబెట్టింది మాత్రం బుమ్రానే. 4-0-14-2.. ఈ గణాంకాలు చూస్తేనే అతడెలా బౌలింగ్‌ చేశాడో చెప్పేయొచ్చు. ఉత్కంఠలో, ఒత్తిడిలో అతను బౌలింగ్‌ చేసిన తీరు అద్భుతం. ముంబై ఫీల్డింగ్‌ తప్పిదాలు చెన్నైకి చాలా వరకు కలిసొచ్చినా... రెండు కళ్లు చెదిరే రనౌట్లు ధోనీసేన కొంపముంచాయి. 

ముంబై బ్యాటింగ్‌: డికాక్‌ 29, రోహిత్‌ 15, సూర్యకుమార్‌ 15, ఇషాన్‌ 23, కృనాల్‌ 7, పొలార్డ్‌ 41 నాటౌట్‌, హార్దిక్‌ 16, రాహుల్‌ చాహర్‌ డకౌట్, దీపక్‌ చాహర్‌ డకౌట్, మెక్లెనగన్‌ (0) రనౌట్‌.
చెన్నై బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-1-26-3, శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-37-2, హర్భజన్‌ 4-0-27-0, బ్రావో 3-0-24-0, ఇమ్రాన్‌ తాహిర్‌ 3-0-23-2, జడేజా 2-0-12-0.
చెన్నై బ్యాటింగ్‌: డుప్లెసిస్‌ 26, వాట్సన్‌ 80 (రనౌట్‌), సురేష్ రైనా 8, రాయుడు 1, ధోని 2 (రనౌట్‌), బ్రావో 15, జడేజా 5 (నాటౌట్‌), శార్దూల్‌ ఠాకూర్‌ 2.
ముంబై బౌలింగ్‌: మెక్లెనగన్‌ 4-0-24-0, కృనాల్‌ పాండ్య 3-0-39-1, మలింగ 4-0-49-1, బుమ్రా 4-0-14-2, రాహుల్‌ చాహర్‌ 4-0-14-1, హార్దిక్‌ పాండ్య 1-0-3-0.