ఆయన తప్పుకుంటేనే కాంగ్రెస్ బాగుపడుతుంది

ఆయన తప్పుకుంటేనే కాంగ్రెస్ బాగుపడుతుంది

ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవి నుంచి తప్పుకుంటేనే కాంగ్రెస్ బాగుపడుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు. ఉత్తమ్‌.. కేసీఆర్‌తో మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఉన్నారని చెప్పారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడానికి ఆయనే కారణమని విమర్శించారు. గ్రూపులు చేసి పార్టీని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. పొత్తులు, చంద్రబాబు ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనట్లు వివరించారు. నాయకత్వ లోపమే కాంగ్రెస్ దుస్థితికి కారణమని తెలిపారు. తనకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్‌ను ఆదుకున్నది తామేనన్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఎన్నికల సమయంలో ఎవరినీ కలుపుకొని పోలేదని, ఆయనకు నాయకత్వ లక్షణాలే లేవని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించిన మునుగోడు ప్రజలు, అనుచరులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని రాజగోపాల్‌ రెడ్డి స్పష్టంచేశారు.