భారత్‌ కు షాకిచ్చిన బంగ్లాదేశ్ జట్టు

భారత్‌ కు షాకిచ్చిన బంగ్లాదేశ్ జట్టు

భారత్‌కు షాకిచ్చింది బంగ్లాదేశ్  జట్టు. షకీబుల్‌, తమీమ్‌ ఆడకున్నా.. తొలి టీ20లో ఈజీగానే విజయాన్ని దక్కించుకుంది. ఓ దశలో బంగ్లాదేశ్ 22బంతులకు 44 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత బౌలర్లు డెత్ ఓవర్లలో భారీగా పరుగులివ్వడంతో.. చేదు ఫలితం మిగిలింది. బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ మినహా మిగిలన బ్యాట్స్‌మెన్‌లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు.

శిఖర్ ధావన్‌ 41 పరుగులతో రాణించాడు. తర్వాత వచ్చిన రాహుల్‌ 15 వద్ద పెవిలియన్ చేరాడు. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్‌ 22, రిషబ్‌ పంత్‌ 27రన్స్‌తో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ కుదురుకుని జోరు పెంచే క్రమంలో వికెట్లు కోల్పోయారు. చివర్లో కృణాల్ పాండ్య 15, వాషింగ్టన్‌ సుందర్‌14 పరుగులతో చేయడంతో జట్టు స్కోరు 148 కి చేరింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ మొదటి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది.

అయితే తర్వాత వచ్చిన సౌమ్య సర్కార్‌ తో  కలిసి ఓపెనర్ నయీమ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. సౌమ్య సర్కార్‌ 39 పరుగులు, నయీమ్‌ 26 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. మిడిలార్డర్లో రహీమ్‌ 60తో ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. ముష్పికర్‌ను ఔట్‌ చేసే అవకాశాన్ని భారత్ రెండు సార్లు చేజార్చుకుంది. దీంతో భారీ మూల్యాన్ని చెల్లించుకుంది మెన్‌ ఇన్ బ్లూ. 19వ ఓవర్ మూడో బంతికి సిక్సర్‌ బాదిన కెప్టెన్ మహ్మదుల్లా జట్టుకు విజయాన్ని అందించాడు . రహీమ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్ లభించింది. టీమిండియా చేతిలో వరుసగా 8 టీ20ల్లో ఓడిన బంగ్లాదేశ్.. ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది.