రామజపం చేస్తూ అంత్యక్రియలు చేసిన ముస్లిం సోదరులు !

రామజపం చేస్తూ అంత్యక్రియలు చేసిన ముస్లిం సోదరులు !


హిందూ ముస్లిం భాయీ భాయీ అనే పదం మనం చాలామార్లు వినేఉంటాం. కానీ ఆ మాటలను నిజం చేశారు వారణాసిలోని ముస్లిం సోదరులు. నిరుపేద కుటుంబానికి చెందిన ఒక హిందూ యువతి మృతదేహానికి ముస్లింలు దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించారు. వారణాసిలో హోరీలాల్‌ విశ్వకర్మ భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. కొద్ది రోజులుగా హోరీలాల్ పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆయన భార్య కూడా గుండె సంబంధింత వ్యాధికి గురైంది. దీంతో ఇద్దరూ ఇంటి వద్దనే ఉంటూ, విశ్రాంతి తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు పని చేయలేని స్థితిలో ఉండడంతో వారి ఆలనాపాలనా కుమారుడే చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే వీరి కూతురు సోని మలేరియా వ్యాధితో బాధపడుతూ నిన్న కన్నుమూసింది. అయితే పనికి వెళితేనే పూట గడిచే కుటుంబం కావడంతో దహనసంస్కారాలు కూడా చేయలేని పరిస్థితి, ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న చుట్టుపక్కల ఉన్న ముస్లిం కుటుంబాల వారే సోని అంత్యక్రియలు చేసేందుకు ముందుకు వచ్చారు. వారే దగ్గరుండి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి తమ భుజాలపై సోని మృతదేహం ఉన్న పాడె ఎత్తుకుని రామ్ నామ్ సత్య హై అంటూ రామజపం చేస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. అంతేకాక ఆ కుటుంబానికి ఖర్చుల నిమిత్తం కూడా కాస్త డబ్బు సాయం చేసి తమ మంచి మనసు చాటి చెప్పారు.