నేను వేరు, నా పార్టీ అభిప్రాయం వేరు

నేను వేరు, నా పార్టీ అభిప్రాయం వేరు

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంకల్ప యాత్ర పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నిన్న ఆ రాష్ట్రానికి చెందిన జర్నలిస్టులతో ముఖాముఖి నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలువురు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. శబరిమలలో మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న ఘటనపై మీ స్పందన ఏంటని ఎకనామిక్ టైమ్స్ పత్రికకు చెందిన అమన్ వర్మ అనే జర్నలిస్టు.. రాహుల్ ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. నా అభిప్రాయం ప్రకారం మహిళల స్వేచ్చపై ఆంక్షలు ఉండొద్దు. వారు ఎక్కడికైనా వెళ్లవచ్చు. కేరళలో అన్ని పార్టీలు కలిసి మహిళల ఆలయ దర్శనాన్ని అడ్డుకుంటున్నాయి. అక్కడ మా పార్టీది భిన్నమైన అభిప్రాయం. మహిళలు ఎక్కడికైనా వెళ్లవచ్చు.. వారిపై ఆంక్షలు ఉండరాదనేది నా అభిప్రాయమని రాహుల్ గాంధీ అన్నారు.

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పు అనంతరం అక్టోబర్‌ 17 నుంచి 22 తేదీల మధ్య మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లడానికి యత్నించగా.. హిందూత్వవాదులు, నిరసనకారులు వారిని అడ్డుకున్నారు.