రెండు ఆత్మహత్యలు.. అనేక ప్రశ్నలు

రెండు ఆత్మహత్యలు.. అనేక ప్రశ్నలు
వారిద్దరూ మూడో తరగతి నుంచి స్నేహితులు. పదో తరగతి వరకు కలిసే చదువుకున్నారు. ఇప్పుడు అతను బీటెక్‌ చదువుతున్నాడు, ఆమె చదువుతూనే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తోంది. ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వీరిద్దరూ ఒకేసారి తనువు చాలించారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖైరతాబాద్‌లోని న్యూ సీఐబీ క్వార్టర్స్‌కు చెందిన వర్షశ్రీ (22) ఇంజినీరింగ్‌ చేస్తూ ఇంటి నుంచే ఉపాధి పనులు చూసుకుంటోంది. బడంగ్‌పేటకు చెందిన మహేశ్వర్‌రెడ్డి (24) ఇబ్రహీంపట్నంలో బీటెక్‌ రెండో ఏడాది విద్యార్థి. శుక్రవారం ఉదయం తండ్రి శ్రీనివాస్‌ విధులకు వెళ్లగా ఇంట్లో నానమ్మ శంకరమ్మ (80)తోపాటు వర్షశ్రీ ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఖైరతాబాద్‌లోని ఆమె ఇంటికి మహేశర్‌రెడ్డి చేరుకున్నాడు. కాసేపటి తన అన్న వెంకటసుమన్‌కు ఫోన్‌ చేసిన వర్షశ్రీ.. ఏడుస్తూ ఫోన్‌ పెట్టేసింది. ఆందోళనతో పావుగంటలో వెంకట సుమన్‌ ఇంటికి చేరుకోగా మహేశ్వర్‌రెడ్డి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. మరో గదిలో చీరతో ఉరేసుకుని వర్షశ్రీ కనిపించింది యువతి శరీరంపై గాయాలు ఉండటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందన్న అనుమానం వ్యక్తం అవుతోంది. మహేశ్వరరెడ్డిని హత్య చేశారని ఆరోపిస్తూ అతని కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. ఇక.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో 108 సిబ్బంది పరీక్షించి వర్షశ్రీ చనిపోయిందని చెప్పడంతో సాయంత్రం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ క్రమంలో వర్షశ్రీ ఊపిరి పీల్చినట్లు కదలిక రావడంతో సచివాలయం సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తెలుస్తోంది. వర్షశ్రీని పెళ్లిచేసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులతో మహేశ్వరరెడ్డి చెప్పగా.. కుటుంబసభ్యులను తీసుకురమ్మని వారు చెప్పారని తెలిసింది. కుటుంబసభ్యులను తీసుకురాకుండా తరచూ మహేశ్వర్‌రెడ్డే వస్తుండడంతో వారు కొపగించుకున్నట్టు సమాచారం. ప్రేమ, పెళ్లి విషయమై ఆమె తల్లిదండ్రులను ఒప్పించేందుకు అతడు వారింటికి శుక్రవారం మధ్యాహ్నం వెళ్లి ఉండవచ్చని అంటున్నారు. మహేశ్వర్‌రెడ్డి తనతోపాటు స్వీట్‌బాక్స్‌, మరో కవర్‌ తీసుకెళ్లినట్టు సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు.