మూవీ రివ్యూ : 'నా నువ్వే'

మూవీ రివ్యూ : 'నా నువ్వే'

నటీనటులు : నందమూరి క‌ల్యాణ్‌రామ్‌, తమన్నా, 'వెన్నెల' కిశోర్, ప్రవీణ్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, సురేఖావాణి తదితరులు 

ఛాయాగ్రహణం : పీసీ శ్రీరామ్ 

సంగీతం : శరత్  

దర్శకత్వం : జయేంద్ర 

నిర్మాత :  కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి

సమర్పణ :  మహేష్ ఎస్ కోనేరు 

విడుదల తేదీ : 14 జూన్ 2018

ల‌వ్‌కి లాజిక్స్‌తో పని వుండదు. మేజిక్ వర్కవుట్ అయితే చాలు. సూప‌ర్‌హిట్‌ గ్యారెంటీ. ఇప్పటివరకూ మాస్ కమర్షియల్ సినిమాలు చేసిన క‌ల్యాణ్‌రామ్‌ ఇమేజ్  ఛేంజోవ‌ర్‌ కోసం చేసిన సినిమా 'నా నువ్వే'. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌లో ఆయన పక్కన తమన్నా కథానాయిక. ఈ రోజు విడుదలైన ఈ సినిమాలో లవ్ మేజిక్ వర్కవుట్ అయ్యిందా? లేదా? చదవండి.  

కథ :

మీరా (తమన్నా) ఓ క్రిమినల్ లాయర్ (తనికెళ్ళ భరణి) కూతురు. మూడేళ్ళు ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతుంది. నాలుగో ఏడాది కూడా ఫెయిల్ అయ్యిందని తండ్రి తిడుతుంటాడు. కాసేపటికి మీరా పాస్ అయ్యిందని తెలుస్తుంది. అప్పుడు ఆమె చేతిలో వరుణ్ (నందమూరి క‌ల్యాణ్‌రామ్‌) ఫొటో వుంటుంది. అప్పట్నుంచీ వరుణ్ ఫొటో చూసిన ప్రతిసారీ మీరాకు మంచి జరుగుతుంది. అయితే... అతని పేరు, వూరు, ఏం చేస్తాడు? వంటి విషయాలేవీ తెలీదు. అయినా అతణ్ణి ప్రేమిస్తుంది. ఇదంతా డెస్టినీ అనుకుంటుంది. అమెరికాలో ఉద్యోగం వచ్చినా... అక్కడికి వెళ్లలేకపోతాడు వరుణ్. ఒక్కోసారి ఒక్కో కారణం చేత ఎయిర్‌పోర్ట్‌ వరకూ వెళ్లినా ఫ్లయిట్ మాత్రం ఎక్కలేకపోతాడు. అతడికి డెస్టినీ మీద నమ్మకం వుండదు. డెస్టినీని నమ్మే మీరా, నమ్మని వరుణ్ చివరికి ఎలా కలుసుకున్నారు? వాళ్ల ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగింది? అనేది సినిమా.  

నటీనటుల పనితీరు :

మీరా పాత్రలో తమన్నా తెరపై కనిపిస్తున్నంత సేపూ ప్రేక్షకులు చూపు తిప్పుకోవడం కష్టమే. అంత అందంగా కనిపిస్తుంది. అంత అందంగా నటించింది. అంతే కాదు... పాటల్లో అందాల ప్రదర్శనతోనూ రెచ్చిపోయింది. క‌ల్యాణ్‌రామ్‌ మేకోవర్ బాగుంది. కొత్త లుక్‌లో చూడ‌బుల్‌గా వున్నారు. అయితే.. కథకు కావలసిన రొమాంటిక్ ఎక్స్‌ప్రెష‌న్స్‌ ఇవ్వడంలో మాత్రం కాస్త తడబడ్డారు. తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, సురేఖావాణి, ప్రవీణ్ తదితరులవి రొటీన్ పాత్రలే. జాతకాల పిచ్చి వున్న పాత్రలో 'వెన్నెల' కిశోర్ నటన, ఆ పాత్ర చిత్రణ 'వెంకీ'లో రవితేజ పాత్రను గుర్తుకు తెస్తుంది. కానీ, అంత క్లిక్ కాలేదు. కామెడీ చేయడంలో క్యారెక్టర్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి.

సంగీతం - సాంకేతిక వర్గం : 

పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ గురించి కొత్తగా చెప్పేదేముంది. తమన్నా అంత అందంగా కనిపించిందంటే క్రెడిట్ ఆయనదే. అలాగే, తమన్నా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినవారికీ కొంత క్రెడిట్ ఇవ్వాలి. రెగ్యుల‌ర్‌గా కాకుండా కొత్తగా, అందంగా వున్నాయి. పాటల్లో హీరో హీరోయిన్లను పీసీ శ్రీరామ్ చాలా అందంగా చూపించారు. శరత్ సంగీతంలో 'ప్రేమికా...', 'నిజమా మనసా...'. 'చినికి చినికి...' స్వరాలు, సాహిత్యం బాగున్నాయి. నిర్మాత విలువలు సూపర్. ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్స్‌లో వుంది. 

దర్శకత్వం : 

జయేంద్ర కథ, అందులోని సన్నివేశాల్లో మేజిక్ వర్కవుట్ అయ్యిందా? లేదా? అనే అంశాల కంటే టెక్నికల్ విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ప్రేమకథలను జడ్జ్ చేయడానికి పెద్దగా విషయం ఏమీ వుండదు. స్క్రీన్ మీద హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితే సినిమా వర్కవుట్ అయినట్టే. కెమిస్ట్రీ సరిగా వస్తుందా? లేదా? అనేది దర్శకుడు చూసుకోవాలి. సినిమాలో మంచి రొమాంటిక్ సన్నివేశాలు రాసుకున్న జయేంద్ర, వాటిలోని ఫీల్ తెరమీదకు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు.    

విశ్లేషణ :

ముందు చెప్పినట్టు... తమన్నా అందంగా వుంది. అందాల ప్రదర్శన చేసింది. సినిమాటోగ్రఫీ సూపర్. పాటల్లో మూడు వినసొంపుగా వున్నాయి. కానీ, కథలో మేటర్ మరీ వీక్. ఏదో డెస్టినీ నమ్మే అమ్మాయి ఫొటో చూసి ప్రేమలో పడిందని సర్దిచెప్పుకున్నా... అబ్బాయి ప్రేమలో ఎందుకు పడ్డాడు? అనే విషయంలో సరైన క్లారిటీ లేదు. ల‌వ్‌లో లాజిక్స్‌ వెతక్కూడదు, ఓన్లీ మేజిక్స్ చూడాలని వాటి కోసం ఎదురుచూసినా? ఎక్కడా కనిపించవు. క‌ల్యాణ్‌రామ్‌, తమన్నా మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు. సినిమాల్లో లవ్ ఫీల్ కూడా వర్కవుట్ కాలేదు. దాంతో సన్నివేశాలు తెరపై వచ్చి వెళ్తున్న భావన తప్ప, ప్రేక్షకుల మనస్సులో ఎలాంటి భావన కలగదు. ఆ ప్రేమను ఫీల్ అవ్వలేరు. దాంతో సినిమా చప్పగా సాగుతుంది. అయితే... తమన్నా అందాలు మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయం. మాస్ ప్రేక్షకులకు అందాల విందు గ్యారెంటీ!  ముఖ్యంగా  క‌ల్యాణ్‌రామ్‌కి రొమాంటిక్ జానర్ కంప్లీట్‌గా కొత్త కావడంతో ఆయన్ను ఆ పాత్రలో ఊహించుకోవడానికి ప్ర్రేక్షకులకు కొత్త టైమ్ పడుతుంది.