జూనియర్ ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు..!

జూనియర్ ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు..!

సినీనటుడు, నందమూరి తారకరామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు... సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయాన్ని చవిచూసిన తర్వాత.. ఓవైపు జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీకి పూర్వవైభవం వస్తుందనే చర్చ సాగుతోన్న సమయంలో.. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఏపీలో తెలుగుదేశం పార్టీని బతికించలేరని జోస్యం చెప్పారు నాదెండ్ల భాస్కర్‌రావు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే వార్తలను తాను కూడా విన్నానన్న నాదెండ్ల.. అసలు తనకు జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని.. అంతేకాదు తాను సినిమాలు చూడనని చెప్పుకొచ్చారు. అయినా ఈ విషయం పై ఎన్టీఆర్ కుటుంబసభ్యులే నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు నాదెండ్ల భాస్కర్‌రావు. 

మరోవైపు తన కుమారుడు నాదెండ్ల మనోహర్.. జనసేన పార్టీలో ఉండాలా? లేదా ? అనే విషయంపై ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. జనసేన గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదని.. ఇప్పుడు కూడా ఆ పార్టీపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని వెల్లడించారు. అయితే, తన కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరడం ఒక తప్పిదం అని పరోక్షంగా వ్యాఖ్యానించారు మాజీ సీఎం. ఇక, 2014లోనే బీజేపీలో చేరాలని తనకు ఆహ్వానం వచ్చిందని చెప్పారు నాదెండ్ల భాస్కర్‌రావు.. పార్టీ ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆయన.. ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.