అఖిల్‌ను లవ్ స్టోరీలో చూడాలనుకున్నా: నాగచైతన్య

అఖిల్‌ను లవ్ స్టోరీలో చూడాలనుకున్నా: నాగచైతన్య

అక్కినేని యువ హీరో 'అఖిల్' న‌టించిన తాజా చిత్రం 'మిస్ట‌ర్ మ‌జ్ను'. వెంకీ అట్లూరి ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వహించారు. అఖిల్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌లకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే టీజర్‌, సాంగ్స్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో శనివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది.

మిస్ట‌ర్ మ‌జ్ను ప్రీ రిలీజ్ వేడుకకు 'యువసామ్రాట్' అక్కినేని నాగచైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా చైతూ మాట్లాడుతూ... అఖిల్‌కి వెంకీ కరెక్ట్ టైటిల్‌ పెట్టాడు. ఇది సరిగ్గా అఖిల్‌కి సరిపోతుంది. అఖిల్‌ ఫైట్స్‌, డ్యాన్సులు బాగా చేస్తాడని మనకు తెలుసు. కానీ ఒక సోదరుడిగా అఖిల్‌ని ఎప్పటినుండో పూర్తి స్థాయి లవ్‌స్టోరీలో చూడాలని ఉండేది. చివరికి అది జరిగింది. యంగ్‌ డైరెక్టర్స్‌ తొలి చిత్రంతో ఓ మార్క్‌ని సెట్‌ చేసుకుంటారు. గత ఏడాది వెంకీ ‘తొలిప్రేమ’తో అలాంటి మార్క్‌ సెట్‌ చేసుకున్నాడు. గత ఏడాది విడుదలైన చిత్రాల్లో ‘తొలిప్రేమ’ నా ఫేవరేట్‌ చిత్రం అని చైతూ తెలిపారు.

మ్యూజిక్‌, రైటింగ్‌, నటీనటులను ప్రెజెంట్‌ చేయడంలో వెంకీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. అలాగే ‘మిస్టర్ మజ్ను’ని కూడా కేర్‌ తీసుకుని చేసాడు. థమన్‌ అద్భుతమైన పాటలను అందించాడు. ప్రతి సినిమాకు కొత్త తరహా మ్యూజిక్‌ అందిస్తున్నాడు. నిధికి ఈ సినిమాతో పెద్ద సక్సెస్‌ దక్కుతుందని భావిస్తున్నాను. అఖిల్‌కు సపోర్ట్‌గా వచ్చినందుకు ఎన్టీఆర్‌కి థాంక్స్. జనవరి 25న చిత్రం విడుదల అవుతోంది. చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు‌ అని చైతూ చెప్పుకొచ్చారు.