ఆ దేవదాస్ పుట్టినరోజు కానుకగా ఈ దేవదాస్..!!

ఆ దేవదాస్ పుట్టినరోజు కానుకగా ఈ దేవదాస్..!!

తెలుగు సినీ పరిశ్రమలో అనేక విజయాలు అందుకున్న నటుల్లో ఒకరు అక్కినేని నాగేశ్వర రావు గారు.  అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు.  తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ ఇద్దరు ఎన్నో సేవలు చేశారు.  

1924 సెప్టెంబర్ 20 వ తేదీన కృష్ణాజిల్లాలోని రామాపురంలో జన్మించిన అక్కినేని నాగేశ్వర రావు, చిన్న తనం నుంచి నాటకాలు వేసేవారు.  ఊర్లో అనేక నాటకాలు వేసి పేరుగాంచారు.  సినిమాలపై ఆసక్తితో.. మద్రాస్ వెళ్లేందుకు విజయవాడ వచ్చిన నాగేశ్వర రావుకు.. ఘంటసాల బలరామయ్య రూపంలో అదృష్టం తలుపు తట్టింది.  1941 లో 17 సంవత్సరాల వయసులో ధర్మపత్ని అనే సినిమాలో వేషం దొరికింది.  అక్కడి నుంచి అక్కినేని వెనుదిరిగి చూసుకోలేదు.  దాదాపు 200 లకు పై చిలుకు చిత్రాల్లో నటించారు.  లైలామజ్ను, దేవదాస్, అనార్కలి, బాటసారి, మూగమనసులు, ప్రేమ నగర్, ప్రేమాభిషేకం, మేఘసందేశం, గుండమ్మకథ, మిస్సమ్మ, డాక్టర్ చక్రవర్తి, దసరా బుల్లోడు వంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి.  

మద్రాస్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించి సినిమా షూటింగ్లు హైదరాబాద్ లోనే జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు.  ఇలా సినిమా పరిశ్రమకు ఎన్నో సేవలు చేసిన అక్కినేని నాగేశ్వర రావు, తన కుటుంబంతో కలిసి నటించిన మనం సినిమా ఆఖరిది.  ఈ సినిమా నిర్మాణంలో ఉండగా ఆయనకు కోలన్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు.  జనవరి 22, 2014 వ సంవత్సరంలో అక్కినేని తుదిశ్వాస విడిచారు.  

అక్కినేని సినిమా జీవితంలో అద్భుతమైన చిత్రంగా నిలిచిన సినిమా దేవదాస్.  ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.  ప్రేమ విఫలమయ్యి ముందుకు బానిసగా మారిన వ్యక్తిగా నాగేశ్వర రావు అద్భుతంగా నటించారు.  నాగేశ్వర రావు దేవదాస్ టైటిల్ తో ఇప్పుడు ఆయన తనయుడు అక్కినేని నాగార్జున, నానితో కలిసి దేవదాస్ గా రాబోతున్నారు.  అక్కినేని జయంతి రోజైన సెప్టెంబర్ 20 న ఈ అభినవ దేవదాస్ ఆడియో వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకు వైజయంతి మూవీస్ ప్లాన్ చేసింది.