సాగర్‌ అన్ని గేట్లు ఎత్తివేత.. పర్యాటకుల తాకిడి షురూ

సాగర్‌ అన్ని గేట్లు ఎత్తివేత.. పర్యాటకుల తాకిడి షురూ

శ్రీశైలం డ్యామ్ నుంచి భారీ స్థాయిలో నీరు వచ్చి చేరుతుండడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర 26 గేట్లను ఎత్తివేశారు అధికారులు... శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున నీరు వస్తుండడంతో ప్రాజెక్టులోని మొత్తం 26 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లోకి 8.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. నీటిని దిగువకు విడుదల చేస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీగా నీరు వచ్చి చేరుతోంది... ప్రస్తుతం 8.63 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 8.50 లక్షల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. ఇక, కృష్ణమ్మ అందాలు చూసేందుకు శ్రీశైలం డ్యామ్‌కు పర్యాటకులు పోటెత్తడంతో.. కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి... ఆదివారం రోజు డ్యామ్‌కు కనీసం 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయి.. పర్యాటకులు ఇబ్బంది పడ్డారు. రాత్రి సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరు రద్దీని చూసి వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి. మరోవైపు నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేశారన్న వార్తలు రావడం.. ఇవాళ సెలవు కూడా ఉండడంతో.. సాగర్ దగ్గర కృష్ణమ్మ అందాలను చూసేందుకు క్యూకడుతున్నారు పర్యాటకులు. దీంతో.. సాగర్ దగ్గర పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.