వడ సాంబార్ లో చనిపోయిన బల్లి ప్రత్యక్షం

 వడ సాంబార్ లో చనిపోయిన బల్లి ప్రత్యక్షం

మహారాష్ట్ర నాగ్ పూర్ లోని అజానీ స్క్వేర్ లో ప్రముఖ  స్నాక్స్ తయారీదారు హల్దీరాం నిర్వహిస్తున్న హోటల్ కు ప్రతిరోజు జనం ఎగబడతారు. అక్కడ అందించే టిఫిన్లు శుచితో పాటు శుభ్రంగా ఉంటాయనేది కస్టమర్ల నమ్మకం. అందరిలాగే నాగ్ పూర్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి వడ సాంబార్ అర్డర్ ఇచ్చాడు. సగం తిన్న తరువాత షాక్ కు గురయ్యారు. వడ సాంబార్ లో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైంది. హల్దీరాం అవుట్‌‌లెట్‌ సూపర్‌వైజర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారిద్దరూ ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స తీసుకొని గురువారం డిశ్చార్జి అయి వెళ్లారు. అయితే, సాంబార్‌లో బల్లిపడిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు ఈ విషయమై సదరు హోటల్‌ను తనిఖీ చేశారు. ఘటనపై విచారణ చేపట్టామని ఎఫ్‌డీఏ కమిషనర్‌ మిలింద్‌ దేశ్‌పాండే తెలిపారు. కిచెన్‌లో ఉన్న లోపాలను గుర్తించామని, ఆహార భద్రతా, నాణ్యతా ప్రమాణాలకు లోబడి హోటల్‌ నడుచుకునే విధంగా ఉత్తర్వులు ఇచ్చామని చెప్పారు. కిటీకీలకు తెరలు బిగించాలని ఆదేశాలు జారీచేశామని వెల్లడించారు. అప్పటి వరకు హోటల్‌ను మూసేయించామని వివరించారు.