నల్గొండ టీఆర్ఎస్ నేతల మధ్య కొత్త పంచాయతీ !

నల్గొండ టీఆర్ఎస్ నేతల మధ్య కొత్త పంచాయతీ !

వారిద్దరు అధికార పార్టీ నేతలే. ఒకరు ఎమ్మెల్యే మరొకరు మాజీ ఎమ్మెల్యే. వారి మధ్య కామన్‌ పాయింట్‌ కొన్ని మండలాలు. అక్కడి వారికి పదవి ఇవ్వాలని పార్టీ డిసైడ్‌ కావడంతో... అది తమవారే అయిఉండాలని ఎవరికి వారు పోటీ పడుతున్నారట. అంతేకాదు.. ఈ విషయంలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్‌లో చర్చగా మారింది. 

 

మాల్‌ మార్కెట్‌ కమిటీ పదవిపై నేతల మధ్య కుస్తీ!

 

నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న మాల్‌ మార్కెట్‌ కమిటీ పీఠం కోసం టీఆర్‌ఎస్‌లో చర్చ మొదలైంది. ఈ పదవి కోసం దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్‌, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మధ్య పంచాయితీ మొదలు కావడంతో ఎవరు పైచేయి సాధిస్తారన్నదానిపై జనాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాల్ మార్కెట్ కమిటీ రెండు నియోజకవర్గాల పరిధిలో ఉండటమే ఈ పంచాయితీకి కారణం. దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం, మునుగోడు నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి, మర్రిగూడ మండలాలు ఈ మార్కెట్‌ కిందకే వస్తాయి. 

 

రొటేషన్‌ ప్రకారం తమకే కావాలంటున్న ఎమ్మెల్యే 

మాల్‌ మార్కెట్‌ కమిటీ పదవిని రొటేషన్‌ పద్దతిలో ఒక్కోసారి ఒక్కో మండలానికి సీరియల్‌గా కేటాయిస్తారు. ఈసారి రొటేషన్‌లో చింతపల్లి మండలానికి దక్కుతుందని తన అనుచరుడిని సిద్ధం చేశారట ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌. కానీ.. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కొత్త వాదన తీసుకురావడంతో పీటముడి పడిందట. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో టీఆర్‌ఎస్‌ ఓడిపోయినందున.. పార్టీని బలోపేతం చేసుకునేందుకు మర్రిగూడకు చెందిన తన అనుచరుడికి పదవి ఇవ్వాలని సూచించారట. 

 

మంత్రి జగదీష్‌ దగ్గరకు చేరిన పంచాయితీ!

 

ఇద్దరూ అధికార పార్టీ నేతలే కావడంతో ఈ సమస్య ఎటూ తేలడం లేదట. దీంతో ఈ పంచాయితీ మంత్రి జగదీష్‌ దగ్గరకు చేరిందట. మంత్రి ఈ తగువుకు ఎలాంటి పరిష్కారం సూచిస్తారో అని అంతా చర్చించుకుంటున్నారు. రొటేషన్‌ ప్రకారం తమకే రావాలని ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌ పట్టువీడటం లేదట. అంతే పంతం ప్రదర్శిస్తున్నారట ప్రభాకర్‌రెడ్డి. మరి.. మాల్ మార్కెట్‌ పీఠంపై ఎవరిని కూర్చోబెడతారో చూడాలి.