కేసీఆర్‌కు నామా నాగేశ్వరరావు కౌంటర్

కేసీఆర్‌కు నామా నాగేశ్వరరావు కౌంటర్

టీఆర్ఎస్ బహిరంగసభలో టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు... ఇవాళ ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత, ఖమ్మం మహాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు... కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. నిధులు, నియామకాలు, నీళ్ల కోసం తెలంగాణ సాధించుకున్నాం అన్నారు.. నీళ్ల విషయానికి వస్తే ... ఆనాడు కేసీఆర్ అన్న మాట ఎన్ని నీళ్లు వాడుకున్నా ఇంకా మిగిలే ఉంటాయని తెలిపారు... కానీ, నేడు... అదే నీళ్ల విషయంలో చంద్రబాబును నిందిస్తున్నారని మండిపడ్డారు. నిన్న ఖమ్మం పర్యటనలో సీతారామ ప్రాజెక్టు అడ్డుకున్నారని చంద్రబాబు లెటర్ ఇచ్చారని కేసీఆర్ చెప్పారు... కానీ, అది సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ విషయంలో ఇచ్చిన లెటర్ అని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణలో టీడీపీ లేదు అనే కేసీఆర్.. ఇప్పుడు చంద్రబాబుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల్లో సెంటిమెంట్ ను రగలించేందుకే చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డ నామా... 2014లో నార్త్, సౌత్లో పవర్ గ్రిడ్లు ఓపెన్ కావడం.. వాటికి తోడు సోలార్ ప్లాంట్లు విరివిగా అందుబాటులోకి రావడం వల్ల అన్ని రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని గుర్తుచేశారు. నాలుగున్నర సంవత్సరాలలో ట్రైబల్ యూనివర్సిటీని ఎందుకు తీసుకురాలేక పోయారు...? బయ్యారం స్టీల్ ఫ్యాక్టర్ ని ఎందుకు తీసుకురాలేదు ? అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాకు రావాల్సిన ఏవీ తీసుకురాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసిన నామా నాగేశ్వరరావు... మీ హయాంలో 8,000 పరిశ్రమలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు రీడిజైన్ చేసి వ్యయం లక్ష కోట్లు పెంచింది నిజంకదా? అని ప్రశ్నించారు. ఇక చంద్రబాబును అడ్డుకోవడం ఎవడి వల్లా కాదు... చెప్పవలిసి వచ్చినప్పుడు ఆయనే ప్రజలకు సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.