'నమో టీవీ'.. ఇక ఇంతే సంగతులు..!

'నమో టీవీ'.. ఇక ఇంతే సంగతులు..!

వివాదాల నడుమ ప్రారంభమైన టెలివిజన్‌ ఛానల్‌ 'నమో టీవీ' ప్రసారాలు నిన్న సాయంత్రం నుంచి నిలిచిపోయాయి. సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్‌ ముగిసిన వెంటనే నమో టీవీ మూగబోయింది. డీటీహెచ్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రసారాలు ప్రారంభించిన 'నమో టీవీ' స్క్రీన్‌పై ఇప్పుడు 'నో సర్వీస్‌' దర్శనమిస్తోంది. ఈ ఏడాది మార్చి 26వ తేదీన నమో టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 24 గంటలపాటు బీజేపీ సంబంధిత కార్యక్రమాలతోపాటు వివిధ ప్రాంతాల్లో మోడీ ఎన్నికల ప్రసంగాలను ఈ ఛానల్ లైవ్‌ టెలికాస్ట్‌ చేసింది. బీజేపీ ఫండింగ్‌తో ప్రారంభమైన ఈ ఛానల్‌.. తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందంటూ విపక్ష నేతలు ఈసీకి సైతం ఫిర్యాదు చేశారు. 

ఎన్నికల ముగిసిన వెంటనే హఠాత్తుగా ఈ ఛానల్‌ ప్రసారాలు నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది. టాటా స్కై, వీడియోకాన్‌ తదితర డీటీహెచ్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఫ్రీ సర్వీస్‌గా ప్రసాదమయ్యింది. ఇందులో ప్రసారం చేసేందుకు రూపొందించిన వివిధ కార్యక్రమాల కోసం పార్టీ భారీగానే ఖర్చు చేసింది. ఎన్నికలు ముగిసినందున ఇక ఈ ఛానల్‌ కోసం ఖర్చు పెట్టడం అవసరం లేదని బీజేపీ భావించినట్టు తెలిసింది. అందులో భాగంగానే ప్రసారాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.