కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి చుక్కెదురు..

కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి చుక్కెదురు..

చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి చుక్కెదురైంది. కొండా విశ్వేశ్వరరెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించిన నాంపల్లి కోర్టు... ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా, ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను నిర్బంధించిన ఘటనలో ముందస్తు బెయిల్‌ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి.. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులను నిర్బంధించి, ఆపై వేధించారంటూ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల గచ్చిబౌలిలో తనిఖీలలో దొరికిన రూ.10 లక్షల నగదుకు సంబంధించిన కేసులో నోటీసులు ఇచ్చేందుకు ఎస్‌ఐ కృష్ణ తన సిబ్బందితో విశ్వేశ్వర్‌రెడ్డి కార్యాలయానికి వెళ్లాడు. ఈ క్రమంలో నోటీసులను కార్యాలయంలోని హెచ్‌ఆర్‌కు ఇవ్వడానికి వెళ్లగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తన సిబ్బందితో ఎస్‌ఐ కృష్ణను ఒక గదిలో నిర్భందించారు. అంతటితో ఆగకుండా ఎస్‌ఐ కృష్ణను పరుష పదజాలంతో దూషించి విధులకు ఆటంకం కల్పించడంతో పాటు తన సిబ్బందితో కలిసి విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐపై దౌర్జన్యం చేశారని కేసు పెట్టారు. దీంతో గత వారం రోజులుగా కొండా విశ్వేశ్వరరెడ్డి కోసం బంజారాహిల్స్ వెదుకుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీన నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. కాగా, కొండా విశ్వేశ్వరరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది నాంపల్లి కోర్టు.