ఆరు నెలలకే ఆ ఎమ్మెల్యేకి పదవిపై విరక్తి..అందుకేనా ?

ఆరు నెలలకే ఆ ఎమ్మెల్యేకి పదవిపై విరక్తి..అందుకేనా ?

ఎమ్మెల్యే అని పిలిపించుకోడానికి అనడానికి వందల కోట్లు ఖర్చు పెట్టే నేతలను నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ.. ఆ ఎమ్మెల్యేకి గెలిచిన ఆరు నెలలకే ఆ పదవిపై విరక్తి పుట్టింది. భవిష్యత్‌లో మీ కాళ్లు పట్టుకోను. పోటీ చేయను. ఓట్లు అడగను అని తెగేసి చెబుతున్నారు. ఇంతలోనే అంత  కష్టం వచ్చిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయనకు వచ్చిన కష్టం ఏమిటో ఇప్పుడు చూద్దాం.! 

నందికొట్కూరు వైసీపీలో స్వపక్షంలో ప్రతిపక్షం
 

అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు.. విమర్శలు మామూలే. కానీ, కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ నేతలు ప్రతిపక్షానికి ఆ చాన్స్‌ ఇవ్వడం లేదు. వాళ్లే వాల్ల పార్టీకి ఎమ్మెల్యేకి  ప్రత్యర్థుల్లా తయారయ్యారు. ఎంతెలా అంటే.. ఆ ఎమ్మెల్యే ఇక మళల్ఈ పోటీ చేయను అనేంతగా. పరస్పరం నిలదీసుకోవడం మామూలైపోయింది. ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్‌కు, సొంత పార్టీ కార్యకర్తలకు మధ్య పొసగటం లేదు. జూపాడుబంగ్లా మండలం బన్నూరు జనం సమక్షంలోనే  వాదులాడుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలయ్యాక నందికొట్కూరు వైసీపీ ఇంచార్జ్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్‌ మధ్య విభేదాలు వచ్చాయి. ఎమ్మెల్యే పదవికి ఆర్థర్‌ రాజీనామా చేస్తాననే వరకూ గొడవలు వెళ్లాయి. ఇదే విషయంపై ఆయన పార్టీ పెద్దల ముందు కూడా వాపోయారట. విషయం తెలుసుకుని ఒకటి రెండుసార్లు అధిష్ఠానం ఇద్దరి మధ్యా సయోధ్యకు ప్రయత్నించింది. అయితే అవి కొలిక్కి రాలేదు. 
 
డీఎస్పీ హోదాలో ...ఉమ్మడి అసెంబ్లీకి చీఫ్‌ మార్షల్‌

ఎమ్మెల్యే ఆర్థర్‌ రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కాదు. డీఎస్పీ హోదాలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు.  ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి చీఫ్‌ మార్షల్‌గా పనిచేశారు ఆర్థర్‌. అలా అసెంబ్లీలో చీఫ్‌ మార్షల్‌గా ఉన్న వ్యక్తి నేడు అసెంబ్లీలో అధ్యక్షా అని పిలిచే వరకూ వెళ్లారు. ఒక పోలీస్‌ అధికారిగా అందరికీ ఆర్డర్లు వేసిన ఆయనకు రాజకీయ నాయకులు పాతే అయినా.. రాజకీయాలు మాత్రం ఆయనకు కొత్త. ఎత్తులకు పైఎత్తులు వేయలేకపోతున్నారో.. పార్టీ వారిని కలుపుకొని వెళ్లలేకపోతున్నారో గానీ ఖాకీ దుస్తుల్లో ఇమిడిపోయినంతగా..ఖద్దరు డ్రెస్‌లో కుదురుకోలేకపోతున్నారనేది  నియోజకవర్గంలో ఉన్న టాక్‌.

సిద్ధార్థరెడ్డి వర్గం రాకపోతే ఏం చేయను?

నియోజకవర్గంలో ఒక వర్గం తనను టార్గెట్‌ చేసిందనేది ఎమ్మెల్యే ఆర్థర్‌ వాదన. ప్రజలకు అందుబాటులో ఉంటున్నా.. సాయం కోసం అర్ధరాత్రి సైతం ఫోన్‌లో మాట్లాడుతున్నా.. ఉద్దేశపూర్వకంగా కొందరు  ఇబ్బంది పెడుతున్నారని  ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే. అణగారిన వర్గాలకు చెందిన వాడిని కాబట్టి అడుగులకు మడుగులు వత్తాలనే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన వాపోతున్నారు. తనకూ ఆత్మాభిమానం ఉందని సన్నిహితుల దగ్గర  చెప్పుకొంటున్నారు ఎమ్మెల్యే. YS కుటుంబం అంటే తనకు అభిమానం ఉందని.. ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చినా..స్థానిక నేతలు ఏమీ చేయనివ్వడం లేదని చెబుతున్నారు ఆర్థర్‌. సిద్ధార్థ రెడ్డి వర్గీయులు తన వద్దకు రాకుంటే ఏమి చేయగలనని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే. అదే సిద్ధార్థ రెడ్డి వర్గానికి చెందిన కొందరు తన వద్దకు వచ్చి పనులు చేయించుకుంటున్నారని..వారికి ఎలాంటి  ఇబ్బంది కలిగించడం లేదని ఆయన వివరణ ఇచ్చుకుంటున్నారు.

ఆర్థర్‌, సిద్ధార్థరెడ్డి మధ్య మాటల్లేవ్‌!

వైసీపీ ఇంచార్జ్‌ సిద్ధార్థరెడ్డి ప్రస్తుతం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేతో విభేదాలు వచ్చినప్పటి నుంచీ ఆయనతో మాటల్లేవ్‌. నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నా.. ఎత్తుకు పైఎత్తులు వేయడంలో దిట్ట. తన అనుచర వర్గంతో తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారనే టాక్‌ నియోజకవర్గంలో ఉంది. నందికొట్కూరులో బలమైన వర్గం.. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న తనకు.. నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఎమ్మెల్యే ఇవ్వడం లేదన్నది సిద్దార్థరెడ్డి ఆరోపణ. ఎమ్మెల్యేను తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని.. ఈ ఎస్సీ నియోజకవర్గంలో పెత్తనం చెలాయించాలనే లక్ష్యంతో బలమైన వర్గాన్ని పెంచుకున్నారు సిద్ధార్థరెడ్డి.  అయితే ఎమ్మెల్యే మాత్రం ఆయన దారిలోకి రావడం లేదు. బన్నూరులో ఇదే విషయంపై ఎమ్మెల్యే, సిద్ధార్థరెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల్లో ఇంటింటీకీ తిరిగి ఓటు వేయించిన తాము.. ఇప్పుడు కాకుండా పోయామా అని ఎమ్మెల్యేను నిలదీశారు సిద్ధార్థరెడ్డి వర్గీయులు. ఈ సందర్భంగానే తన బాధనంతా బయటపెట్టారు ఎమ్మెల్యే ఆర్థర్‌.  తన పర్యటనపై ముందుగానే సమాచారం ఇచ్చానని చెబుతు.. ఎమ్మెల్యేగా విసిగిపోయానని.. మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని బహిరంగంగా ప్రకటించారు ఎమ్మెల్యే. ఎవరి కాళ్లూ పట్టుకోబోనని స్పష్టం చేశారు. పని ఉంటే.. నా దగ్గరకు రండి.. పని చేసి పెడతా అని కుండబద్దలు కొట్టారాయన.  దీంతో వేదికపైనే రెండు వర్గాలూ విమర్శలు..ప్రతివిమర్శలు చేసుకున్నాయి. స్టేజ్‌పై ఈ షో చూసిన జనం విస్తుపోగా.. పరువు పోతోందని భావించిన కొందరు నాయకులు.. రెండు వర్గాలకు సర్ది చెప్పి పంపించేశారు. 

అధిష్ఠానం ఇద్దరినీ కలుపుతుందా?

బన్నూరు గొడవ తర్వాత ఎమ్మెల్యే ఆర్థర్‌, వైసీపీ ఇంచార్జ్‌ సిద్ధార్థరెడ్డి మధ్య మాటలు బంద్‌ అయ్యాయి. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కీలకమైన ఇద్దరు నాయకుల వైఖరికి పార్టీ కేడర్‌ కలవర పడుతోందట. ఇప్పటికే వీరిమధ్య సయోధ్యకు ప్రయత్నించి విఫలమైన అధిష్ఠానం..ఇప్పుడైనా ఆర్థర్‌ను, సిద్ధార్థరెడ్డిని కలుపుతుందా లేక.. ఎవరికి వారు కొట్టుకుంటుంటే నందికొట్కూరులో అంతే అని లైట్‌ తీసుకుంటుందో చూడాలి.