రివ్యూ : నన్ను దోచుకుందువటే

రివ్యూ : నన్ను దోచుకుందువటే

నటీనటులు : సుధీర్ బాబు, నభా నటేష్, నాజర్, తులసి తదితరులు 

మ్యూజిక్ : అజనీష్ లోక్ నాథ్ 

నిర్మాత : సుధీర్ బాబు 

దర్శకత్వం : ఆర్ఎస్ నాయుడు 

రిలీజ్ డేట్ : 21-09-2018

ఏం మాయ చేశావే సినిమాలో ఓ చిన్న రోల్ చేసి ఆ తరువాత అనేక చిత్రాల్లో హీరోగా నటించాడు.  సోలో హీరోగా మాత్రమే కాకుండా శమంతకమణి వంటి సినిమాలో నారా రోహిత్ తో కలిసి మల్టీస్టారర్ గా చేశాడు.  సమ్మోహనం సినిమాతో మంచి హిట్ అందుకున్న సుధీర్ బాబు, సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి నన్ను దోచుకుందువటే సినిమా సినిమా తీశారు.  మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం.  

కథ : 

సుధీర్ బాబు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తుంటాడు.  పని తప్పించి వేరే ధ్యాస లేదు.  అందరు తనలా కష్టపడి పనిచేయాలన్నది అతని ఉద్దేశ్యం.  పనిచేసే కంపెనీలో మంచి పేరు తెచ్చుకొని అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడి తండ్రి కోరిక తీర్చాలన్నది అతని లక్ష్యం.  ఈలోగా సుధీర్ బాబు తన మేనమామ కూతురు వర్షిణితో వివాహం చేయాలనీ అనుకుంటారు.  ఆ పెళ్లి సత్యకు ఇష్టం లేదు.  దీంతో ఆమె కోరిక మేరకు వర్షిణి స్నేహితురాలు నభా నటేష్ ను ప్రేమించానని అబద్దం చెప్తాడు.  ఆ అబద్దాన్ని నిజం చేయడానికి సుధీర్ బాబు ఏం చేశాడు..? నభాను ప్రేమలోకి దించేందుకు ఎలా ప్రయత్నం చేశాడు..? చివరికి ఏమైంది అన్నది చిత్రకథ.  

విశ్లేషణ : 

వర్తమానానికి తగినట్టుగా, వాస్తవిక పరిస్థితులకు దగ్గరగా ఉండేలా కథను కథనాలను అల్లుకున్నారు.  ఇలా రాసుకున్న కథనాలను అనుకున్నట్టుగా తెరపై చిత్రీకరించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.  సుధీర్ బాబు ఆఫీస్ వాతావరణాన్ని చూపించిన తీరు అద్భుతంగా ఉంటుంది.  స్ట్రిక్ట్ మేనేజర్ ఆఫీస్ లో ఉంటె ఎలా ఉంటుందో అచ్చంగా అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు.  అలాంటి బాస్ తో పనిచేయడం అంటే ఎలా ఉద్యోగులు ఎలా ఫీల్ అవుతారో, బాస్ యెడల వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇందులో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.  హీరోయిన్ నభా షార్ట్ ఫిల్మ్ యాక్టర్.  షార్ట్ ఫిల్మ్ హంగామాను, ఫిల్మ్ చిత్రీకరించే విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.  గతంలో దర్శకుడికి షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణలో ఉన్న అనుభవం ఇక్కడ ఉపయోగపడింది.  ఫస్ట్ హాఫ్ సరదాగా, వినోదాత్మకంగా సాగిపోతుంది.  సెకండ్ హాఫ్ లో డ్రామాకు  స్కోప్ ఉన్నా, హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.  హాస్యాన్ని చూపిస్తూనే అక్కడడక్కడా కుటుంబానికి సంబంధించిన సీన్స్ ను చూపిస్తూ అందులో సెంటిమెంట్ ఉండేలా చూసుకోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కు రప్పించే ప్రయత్నం చేశాడు.  సీరియస్ గా ఉండే సుధీర్ బాబు షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసే సమయంలో ఫన్ బాగా క్రియేట్ అయింది.  

నటీనటుల పనితీరు : 

సుధీర్ బాబు, నభా నటేష్ ల చుట్టూనే కథ ఎక్కువగా తిరుగుతుంది.  వీరిద్దరే సినిమాకు ప్లస్ అయ్యారు.  ఆఫీస్ లో ఉద్యోగులు క్షమశిక్షణతో ఉండాలని, వారిని తనలా  సిన్సియర్ గా పనిచేయించే బాస్ పాత్రలో సుధీర్ బాబు మెప్పించాడు.  నభా నటేష్ నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది.  ఏరికోరి నభాను ఎందుకు తీసుకున్నారో ఈ సినిమా చూస్తే అర్ధం అవుతుంది.  నాజర్, వేణు,హర్ష, తులసి తదితరులు ఎవరి పాత్ర మేరకు వారు నటించారు.  

సాంకేతిక వర్గం పనితీరు : 

అజనీస్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం బాగుంది.  సురేష్ కెమెరా పనితనం మెచ్చుకునే విధంగా ఉంది.  ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉండేలా చూసుకున్నారు.  నటుడిగా గుర్తింపు పొందిన సుధీర్ బాబు నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు.  సినిమా స్థాయికి తగ్గట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయి.  దర్శకుడికి మొదటి సినిమా అయినప్పటికి సినిమాను నడిపిన తీరు ఆకట్టుకుంది.  షార్ట్ ఫిల్మ్స్ తీసిన అనుభవంతో.. ఈ చిత్రంలో షార్ట్ ఫిల్మ్ మేకింగ్ ను తీసుకొచ్చి.. దానిద్వారా హాస్యాన్ని పండించారు.  క్లైమాక్స్ లో వచ్చే సెంటిమెంట్ చిత్రీకరణ బాగుంది.  మొదటి సినిమాతో అటు దర్శకుడు, ఇటు నిర్మాత విజయం సాధించారని చెప్పొచ్చు.  

పాజిటివ్ పాయింట్స్ : 

కథ 

కథనాలు 

సుధీర్ బాబు, నభా నటేష్ 

కామెడీ 

సెంటిమెంట్ 

నెగెటివ్ పాయింట్స్ : 

సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ సాగతీతగా ఉండటం. 

చివరిగా : మనసును దోచుకున్న నన్ను దోచుకుందువటే..