ప్రజావేదిక అక్రమ నిర్మాణం కాదు..

ప్రజావేదిక అక్రమ నిర్మాణం కాదు..

ప్రజావేదిక నిర్మాణం అక్రమం కాదన్నారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్.. ప్రజావేదిక కూల్చివేత తొందరపాటని ఆయన ఆరోపించారు. 69 ఏళ్ల చంద్రబాబు ఇంట్లో నిద్రిస్తుంటే.. రాత్రికి రాత్రే ప్రజావేదికను కూల్చారని మండిపడ్డారు. 2017లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పరిశీలిస్తే.. ఏది అక్రమమో? ఏది సక్రమమో? తెలుస్తుందని సూచించారు నారా లోకేష్. కృష్ణా నదికి 100 మీటర్ల దూరంలో ప్రజావేదిక ఉందని.. కరకట్టమీదు ఉన్న నిర్మాణాలన్నీ అక్రమం కాదన్నారు లోకేష్. మంగళగిరిలో హత్యకు గురైన టీడీపీ నేత ఉమా యాదవ్ కుటుంబసభ్యులను పరామర్శించిన ఆయన.. వారికి ధైర్యాన్ని చెప్పారు. తామంతా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదిక వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏపీలో బీహార్ పాలన నడుస్తోందని ఆరోపించారు లోకేష్.. 30 రోజుల్లోనే వందలాది మంది టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. ఇప్పటికే ఆరుగురిని హత్య చేశారని... 2004లోనూ ఇలాగే జరిగిందన్నారు లోకేష్. ఇంత జరుగుతున్నా.. లా అండ్ ఆర్డర్‌ను తమ చేతిలోకి తీసుకోకుండా సంయమనం పాటిస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్ నివాసం దగ్గరలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.