ఆ దాడి.. కోడికత్తి లాంటి డ్రామానే : లోకేష్‌

ఆ దాడి.. కోడికత్తి లాంటి డ్రామానే : లోకేష్‌

ఏపీ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. రాష్ట్ర మంత్రి ఇంటికి వెళ్ళి ఓ వ్యక్తి తాపీతో దాడి చేసి గాయపరిచే ప్రయత్నం చేయటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దాడికి పాల్పడిన బడుగు నాగేశ్వరరావును ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ నిమిత్తం గురువారం విచారణ కోసం కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే నిందితుడు టీడీపీ సానుభూతిపరుడిగా పోలీసులు గుర్తించారు. ఇక నిందితుడు సోదిరి కూడా టీడీపీలో మండల మహిళా అధ్యక్షురాలి పదవి కలిగి ఉండటంతో రాజకీయ కారణాలపై పోలీసులు విశ్లేషణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పోలీసులు 12 మందిని విచారించారు. ఇందులో ఏడుగురు టీడీపీ నేతలు కూడా ఉన్నారు. ఇక టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కూడా సెక్షన్ 91 కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే.. ఈ ఘటనపై నారా లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా..వైసీపీకి కౌంటర్‌ వేశాడు.  "మంత్రి పేర్ని నానితోనే ఉండే వ్యక్తి, ఆయనపైనే హత్యాయత్నం చేసాడంటే.. ఇదంతా మరో కోడి కత్తి డ్రామాలాంటిదని వేరే చెప్పాలా? కొల్లు రవీంద్ర వంటి తెలుగుదేశం బీసీ నేతను రాజకీయంగా అణిచేసే కుట్ర ఇది. పోలీసులు ఇకనైనా రవీంద్రగారిని వేధించడం ఆపి, మంత్రిని విచారించి నాటకం గుట్టు బయటపెట్టాలి" అంటూ లోకేష్‌ పేర్కొన్నారు.