చంద్రబాబుపై జోకు వేయబోయి..!

చంద్రబాబుపై జోకు వేయబోయి..!

ఎన్నికల సమరం ముగిసింది.. పాత ప్రభుత్వం పోయి.. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది.. అయినా ఆంధ్రప్రదేశ్‌లో పాలక, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. మూడు ట్వీట్లు.. ఆరు కౌంటర్ ట్వీట్లు అనే రీతిలో సోషల్ మీడియాను కూడా ఏపీ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. ఈ సారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ట్వీట్లు సంధించారు మాజీ మంత్రి నారా లోకేష్ "వైఎస్ జగన్ గారూ! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణా తరగతుల ప్రారంభం సందర్భంగా చంద్రబాబుగారి మీద యథాతథంగా బురదజల్లే ప్రయత్నం చేశారు. మీ తండ్రిగారు సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగినదానిని వక్రీకరించి చెప్తూ, "నాకు అబద్దాలు చెప్పడం అలవాటే" అని చంద్రబాబుగారు ఒప్పుకున్నట్టు చెప్పారు." అని... "చంద్రబాబు గారి మీద జోకు వేయబోయి, మీ తండ్రిగారి హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో జరిగిన రూ.400 కోట్ల అవినీతిని మరొక్కసారి ప్రజలకు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. మీరు ఆనాటి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను చదువుకుని వస్తే బాగుండేది. ఆరోజు చంద్రబాబుగారు మాట్లాడింది ఇదిగో చూడండి.'' అంటూ మరో ట్వీట్ చేసి.. గతంలో న్యూస్ పేపర్లలో వచ్చిన కథనాలు అటాచ్ చేశారు. 

ఇక "తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహం ప్రకారం మీ తండ్రిగారి ప్రభుత్వ అవినీతిని బయటపెట్టింది. ఆ వ్యూహంలో ఇరుక్కుని గిజగిజలాడింది వైఎస్ గారే. ఇదిగోండి ఆ మరునాడు వచ్చిన పత్రికా కథనాలు. మీ నాయనగారి అవినీతి ధనయజ్ఞం గురించి ఎంత గొప్పగా రాశాయో చదివి తరించండి.'' అంటూ మరికొన్న పత్రికా కథనాలను అటాచ్ చేశారు నారా లోకేష్... "మీ తండ్రిగారి పాలనలో ఏపీలో ధనయజ్ఞం జరుగుతున్న రోజుల్లో మీరు సెటిల్ మెంట్లతో బిజీగా ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలోనూ, అసెంబ్లీలోనూ ఏం జరుగుతుందో... అది ఇచ్చంపల్లో, ఎల్లంపల్లో తెలుసుకునే అవకాశం లేదు. ఎవరో చెప్పిన గాలి మాటల్ని పట్టుకుని ఆకాశం మీద ఉమ్మే ప్రయత్నం చేయకండి.'' అంటూ మరో ట్వీట్ చేస్తూ హితవు పలికారు నారా లోకేష్.