'నారా' ఫ్యామిలీలో విభేదాలపై రోహిత్..

'నారా' ఫ్యామిలీలో విభేదాలపై రోహిత్..

ఎన్నికలు వచ్చాయంటే చాలు.. రాజకీయ ప్రాధాన్యం ఉన్న ఫ్యామిలీల్లో విభేదాలు ఉన్నాయి? వాళ్లు అందుకే బయటకి రావడంలేదు? ప్రచారం కనిపించడంలేదు? అలిగారు? పార్టీ మారే అవకాశం ఉంది? ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. ఇక ప్రతిపక్షాలు పనిగట్టుకుని వీటిని ఎక్కువగా ప్రచారానికి ఉపయోగించే ప్రయత్నం చేసుకుంటాయి. ఇలాంటే పుకారే ఒకటి షికారు చేసింది... ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. సీఎం చంద్రబాబు తమ్ముడు కుమారుడైన హీరో రోహిత్‌కు దూరంగా ఉంటున్నారని ప్రచారం సాగుతోంది. దీనిపై ఓ ప్రకటనను విడుదల చేశారు నారా రోహిత్. రాష్ట్ర అభివృద్ధికి నారా పేరును బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడంలో చంద్రబాబునాయుడు కృషి అభినందనీయం. మా నాన్న రాంమూర్తినాయుడు, పెదనాన్న రామలక్ష్మణుల్లా కలిసి ఉంటారు. వారి మధ్య విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించడం బాధకరం. మీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించవద్దు అని నారా రోహిత్ హితవుపలికారు. 

నారా పేరును నిలబెట్టడానికి మా కుటుంబం నుంచి ఒక్కరు చాలు. అందుకే మేం క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాం. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా కుటుంబంపై, మా రిలేషన్స్‌పై బురద చల్లకండి. నాలుగు దశాబ్దాల క్రితమే సమాజ అభివృద్ధి కోసం మా ఆస్తులను పాఠశాలలు, పంచాయితీ భవనాలకు విరాళంగా ఇచ్చామని పేర్కొన్నారు రోహిత్. మా కుటుంబాన్ని మా పెదనాన్న నిర్లక్ష్యం చేశారన్న వాదన నూటికి నూరుపాళ్లు అవాస్తవం, అసత్యం అని కొట్టిపారేసిన ఆయన... రాత్రింబవళ్ళు శ్రమించి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎలా చూసుకుంటున్నారో.. అదే విధంగా మమ్మల్ని కూడా చూసుకొంటున్నారని స్పష్టం చేశారు. ఇక ఎంపీ పదవి కోసం సొంత బాబాయిపై చేయి చేసుకొన్న చరిత్ర మాది కాదు.. అది వైఎస్ కుటుంబ చరిత్ర. మాకు పదవులు ముఖ్యం కాదు. మాకు అలాంటి నీచ చరిత్ర అవసరం లేదు. కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగే మీకు కుటుంబ బాంధవ్యాల విలువ తెలుశా? అంటూ ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పెద్దనాన్న ప్రతీ ఏడాది మాతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకొంటారు. ముఖ్యమంత్రిలా కాకుండా ఓ కుటుంబ పెద్దలా గడుపుతున్నారు. మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మాకు ఇస్తున్నారు. మా నాన్న ఆరోగ్యం సరిగా లేని కారణంగానే రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని లేఖలో పేర్కొన్నారు నారా రోహిత్.