దభోల్కర్ మర్డర్ కేసులో ఇద్దరి అరెస్ట్

దభోల్కర్ మర్డర్ కేసులో ఇద్దరి అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ సామాజిక కార్యకర్త, హేతువాది, రచయిత డాక్టర్ నరేంద్ర దభోల్కర్ హత్యకేసులో కొందరు నిందితులను రక్షిస్తున్న న్యాయవాదిని సీబీఐ శనివారం అరెస్ట్ చేసింది. న్యాయవాది సంజీవ్ పునాలేకర్, సనాతన్ సంస్థ సభ్యుడు విక్రమ్ భావేను ముంబైలో అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారి తెలిపారు. వారిద్దరిని ఆదివారం పూణెలోని కోర్టులో హాజరు పరచనున్నారు. దభోల్కర్ పై దాడి చేసిన వారిలో పునాలేకర్ కూడా ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు అధికారులు చెప్పారు. ఆగస్ట్ 20, 2013న పూణెలోని ఓంకారేశ్వర్ వంతెనపై ఉదయం వ్యాహ్యాళి చేస్తుండగా దభోల్కర్ ను తుపాకులతో కాల్చి చంపారు.

హిందూ విదిద్న్య పరిషద్ ఆఫీస్ బేరర్ అయిన పునాలేకర్ వివిధ కేసుల్లో నిందితులైన సనాతన్ సంస్థ కార్యకర్తలు, ఇతర హిందూత్వ కార్యకర్తలకు న్యాయ సహాయం అందిస్తున్నాడు. సనాతన్ సంస్థ సభ్యుడైన భవే, 2008లో థానేలోని థియేటర్లు, ఆడిటోరియంలలో జరిగిన పేలుళ్లలో దోషి. ఇతడిని 2013లో బాంబే హైకోర్ట్ బెయిల్ పై విడుదల చేసింది. 

జూన్ 2016లో సీబీఐ ముందుగా దభోల్కర్ హత్యకు కుట్ర పన్నిన ఈఎన్టీ సర్జన్, సనాతన్ సంస్థ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర తావడేను అరెస్ట్ చేసింది. తావడే రూపొందించిన ప్రణాళిక ప్రకారం సనాతన్ సంస్థ కార్యకర్తలు సారంగ్ అకోల్కర్, వినయ్ పవార్ దభోల్కర్ ను కాల్చి చంపారని సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ లో పేర్కొంది. ఆ తర్వాత ఆగస్ట్ 20, 2103న అరెస్ట్ చేసిన సచిన్ అందురే, శరద్ కలాస్కర్ దభోల్కర్ పై కాల్పులు జరిపారని తెలిపింది.  తదుపరి దర్యాప్తులో అమోల్ కాలే, అమిత్ దిగ్వేకర్, రాజేష్ బంగేరాలను కస్టడీలోకి తీసుకుంది. ఈ ముగ్గురు సెప్టెంబర్ 2017న బెంగుళూరులో హత్యకు గురైన జర్నలిస్ట్, కార్యకర్త గౌరీ లంకేష్ కేసులో కూడా నిందితులు.