మోడీతో పాటు 60 మంది మంత్రుల ప్రమాణస్వీకారం..!?

మోడీతో పాటు 60 మంది మంత్రుల ప్రమాణస్వీకారం..!?

భారత ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక ఆయనతో పాటు సుమారు 60 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారన్న అంచనాలున్నాయి. ఇప్పటికే కేబినెట్ కూర్పుపై బీజేపీ చీఫ్ అమిత్‌ షాతో సుదీర్ఘంగా చర్చించిన మోడీ... కేబినెట్‌కు తుది రూపు ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఎవరికి చోటు కల్పించారు.. ఎవరిని బయటకి పంపిస్తున్నారు అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మోడీ కేబినెట్‌లో మంత్రులుగా ఎవరు ఉండబోతున్నారని ఆశావహులతోపాటు, దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరుణ్‌జైట్లీ కేంద్ర కేబినెట్‌లో ఉండరని తేలిపోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కేంద్ర మంత్రివర్గంలో చేరుతారా? లేదా? అన్నదానిపైనా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. వచ్చే అక్టోబరు-నవంబర్‌లలో జరిగే మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, హరియాణా ఎన్నికల్లో పార్టీని గెలిపించేంతవరకూ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగి, ఆ తర్వాతే మంత్రివర్గంలో చేరుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అమిత్‌షా మంత్రివర్గంలో చేరితే ఆర్థిక, హోం, రక్షణశాఖల్లో ఏదో ఒకటి చేపట్టవచ్చన్న ప్రచారం జరుగుతోంది. నిబంధనల ప్రకారం కేంద్రమంత్రివర్గంలో ప్రధానితో సహా 82 మంది ఉండొచ్చు. ప్రస్తుత మంత్రివర్గంలో ప్రధానమంత్రితో సహా 10 మంది ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉన్నారు. గతంలో కంటే ఈసారి అక్కడ బీజేపీ సంఖ్యాబలం కాస్త తగ్గినందున మంత్రివర్గంలో కూడా ఆమేరకు తగ్గించి పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఈశాన్యరాష్ట్రాలకు కొంత ప్రాధాన్యం పెంచే అవకాశం ఉన్నట్లు నిపుణుల అంచనా. ఇక కర్ణాటక, తెలంగాణల్లో మాత్రమే తాజా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. అందువల్ల ఈ రెండురాష్ట్రాలకూ మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. మరోవైపు జైట్లీ అనారోగ్యం కారణంగా ఆర్థికశాఖ బాధ్యతలను ఇదివరకు తాత్కాలికంగా నిర్వహించిన పీయూష్‌ గోయల్‌కుగానీ, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్‌సిన్హా కుమారుడు జయంత్‌సిన్హాకుగానీ అప్పగించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. సీనియర్లయిన రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, సుష్మా స్వరాజ్‌లపై విశ్వాసం కొనసాగించే అవకాశం ఉంది. స్మృతి ఇరానీకి మంచి ప్రాధాన్యం ఉన్న శాఖ కట్టబెడతారని అంచనావేస్తున్నారు. మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, నరేంద్ర సింగ్‌ తోమర్‌, రాజ్యవర్థన్‌ సింగ్‌ రాఠోడ్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, అర్జునరాం మేఘ్వాల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌లకు ఫోన్లు వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. ఇక, ఎన్డీఏ మిత్రపక్షాలైన పార్టీలకు చెందిన ఎంపీలకు ఎన్ని పదవులు ఇచ్చేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అమిత్‌ షాతో బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. శివసేన,. జేడీ(యు)కు ఒక కేంద్రమంత్రి పదవి, మరో సహాయ మంత్రి పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. బిహార్‌కు చెందిన లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు రాం విలాస్‌ పాసవాన్‌కు మళ్లీ మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ పార్టీతోపాటు, అకాలీదళ్‌, అన్నా డీఎంకేలకు ఒక్కో పదవి లభించే అవకాశం ఉంది.