ప్రధానికి పార్లమెంటుకొచ్చే దమ్ముల్లేవు

ప్రధానికి పార్లమెంటుకొచ్చే దమ్ముల్లేవు

రాఫెల్ అంశంపై ప్రధాని నోరు విప్పి మాట్లాడలేకపోతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యవహారంలో మూడు కీలకమైన విషయాలు ఉన్నాయని రాహుల్ చెప్పారు. మొదటిది ప్రక్రియ, రెండోది ధర, మూడోది..అత్యంత ఆసక్తికరమైనది పైసా దాతృత్వం అని తెలిపారు. భారతీయ వాయుసేన తమకు 126 యుద్ధవిమానాలు వావాలని కోరితే దానిని ఎందుకు 36కి తగ్గించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ లోక్ సభ రాఫెల్ డీల్ పై చర్చను చేపట్టింది. రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తూ మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కొత్త ధర రూ.1,600 కోట్లకు రక్షణ మంత్రిత్వశాఖ అధికారులు అభ్యంతరం తెలపడం వాస్తవమా కాదా అని ప్రధానిని ప్రశ్నించారు. ప్రస్తుతం అత్యంత అవసరమైన పరిస్థితుల్లో ఇంకా భారత గడ్డపైకి రాఫెల్ ఎందుకు రాలేదని అడిగారు. వాయుసేనతో సంప్రదించకుండా ఎందుకు డీల్ మార్చారో చెప్పాలన్నారు. 

వేలాది మంది యువకులకు ఉద్యోగాలిచ్చి మంచి పనితీరు కనబరిచిన రికార్డు హెచ్ఏఎల్ కి ఉన్నప్పటికీ ప్రధాని ఎందుకు విఫలమైన వ్యాపారవేత్త అనిల్ అంబానీకి డీల్ అప్పజెప్పారని నిలదీశారు. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు. రాఫెల్ జెట్స్ ధర చెప్పేందుకు ఆమె నిరాకరించారు. ఆమె ఏఐఏడిఎంకె సభ్యుల వెనక దాక్కుంటారు. ఆమె నవ్వడాన్ని నేను చూస్తున్నాను. మన ప్రధాని నరేంద్ర మోడీకి పార్లమెంట్ కి వచ్చి ప్రశ్నలను ఎదుర్కొనే దమ్ములు లేవని రాహుల్ ఎద్దేవా చేశారు.