240 అనధికార యాత్రలకు ఐఏఎఫ్ కి చెల్లించింది రూ.1.4 కోట్లు

240 అనధికార యాత్రలకు ఐఏఎఫ్ కి చెల్లించింది రూ.1.4 కోట్లు

నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది మొదలు జనవరి 2019 వరకు దేశవ్యాప్తంగా 240 అనధికార పర్యటనలు జరిపారు. మోడీ పర్యటనలకు కిరాయిగా బీజేపీ భారతీయ వాయుసేనకు మొత్తం రూ.1.4 కోట్లు చెల్లించింది. కమర్షియల్ విమానాలు వెళ్లని ప్రాంతాలకు మోడీ ఐఏఎఫ్ విమానాల్లో ప్రయాణించారు. ఈ వివరాలను ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ స్క్రోల్.ఇన్ ఆర్టీఐ ద్వారా సాధించి ప్రచురించింది. కానీ ఈ పర్యటనల్లో ఉపయోగించిన విమానాల వివరాలను మాత్రం ఐఏఎఫ్ చెప్పలేదు.

వార్తాకథనం ప్రకారం కొన్ని పర్యటనలకు చెల్లించిన మొత్తం చాలా తక్కువగా ఉంది. ఆర్టీఐ నుంచి లభించిన గణాంకాలను పరిశీలిస్తే ప్రధాని మోడీ బస్సు, రైలు కంటే చౌకగా విమాన యానం చేశారు. అది కూడా మోడీ పర్యటన సుదీర్ఘంగా ఉండి, ప్రతి గంటకు లెక్కకడితే ఇంత మొత్తం అని ఐఏఎఫ్ తెలిపింది. 27 ఏప్రిల్ 2017న వేసిన చండీగఢ్-సిమ్లా-అన్నాడేల్-చండీగఢ్ ట్రిప్ కి భారతీయ వాయుసేనకు రూ.845 ఇచ్చారు. ఇదే రూట్ కి రెడ్ బస్‌ లో టికెట్ బుక్ చేసుకుంటే సుమారు రూ.1100 ఛార్జీ అవుతుంది. చండీగఢ్-సిమ్లా వన్ వే వాణిజ్య విమానం టికెట్ ధర రూ.2500-5000 వరకు ఉంటుంది. 15 జనవరి 2019లో మోడీ 'హెచ్/పీ బలాంగీర్-హెచ్/పీ పథర్ చేరా' పర్యటనకు బీజేపీ రూ.744 మాత్రమే చెల్లించింది. ఒడిషాలోని బలాంగీర్ జిల్లాలో ఈ మార్గం వాణిజ్యపరంగా ఇంకా కనెక్టివిటీ లేదు. ఆర్టీఐ ప్రకారం 15 జనవరి 2019న జరిపిన ఈ పర్యటనకు మోడీ కేవలం రూ.744 బాడుగ ఇచ్చారు. 

భారతీయ వాయుసేన ప్రకారం అన్ని అనధికార పర్యటనల బాడుగ రక్షణ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ కి అనుగుణంగా ఛార్జ్ చేస్తారు. ఈ వ్యవహారంలో రక్షణ మంత్రిత్వశాఖ నుంచి 1981, 1991, 7 మార్చి 2018 నోటిఫికేషన్లు జారీ చేయడమైంది. 1999 నాటి మెమోరాండం మేరకు ప్రధానమంత్రి భారతీయ వాయుసేన విమానాలను అనధికార పర్యటనలకు ఉపయోగించవచ్చు. అయితే దీనికి కమర్షియల్ రేట్ ప్రకారం కిరాయి వసూలు చేయాలని నిర్ణయించడమైంది.