ఏశాట్ పరీక్షతో 400 శకలాలు.. ఐఎస్ఎస్ కి ప్రమాదం

ఏశాట్ పరీక్షతో 400 శకలాలు.. ఐఎస్ఎస్ కి ప్రమాదం

భారత్ తన ఉపగ్రహాన్ని తానే పేల్చేయడం 'భయంకరం'గా మారిందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం తెలిపింది. ధ్వంసం చేసిన ఉపగ్రహం 400 శకలాలుగా మారి అంతరిక్ష కక్ష్యలో తిరుగుతున్నాయని, వీటితో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పెను ప్రమాదం ఏర్పడిందని చెప్పింది. ఇప్పటి వరకు దాదాపు 60 శిథిలాలను గుర్తించినట్టు నాసా నిర్వాహకుడు జిమ్ బ్రైడెంస్టైన్ అన్నారు. వీటిలో 24 ముక్కలు ఐఎస్ఎస్ గరిష్ఠ దూరానికి పైన ఉన్నాయని వివరించారు. 

'ఇది భయంకరమైనది. శిథిలాలను, గరిష్ఠ స్థాయి వరకు ముక్కలను పంపడం భయంకరమైన విషయం. భవిష్యత్తులో మానవ అంతరిక్ష మిషన్ కి ఇలాంటి చర్యలు అనుకూలమైనవి కావు. గత వారం భారత్ జరిపిన ఏశాట్ పరీక్షతో కక్ష్యలో దాదాపు 400 ముక్కలతో శిథిలాలు వ్యాపించాయని' నాసా టౌన్ హాల్ లో జిమ్ తెలిపారు.

ఇప్పటి వరకు నాసా 10 సెంటీమీటర్లు, అంత కంటే పెద్ద ముక్కలను మాత్రమే నాసా గుర్తించగలిగిందని బ్రైడెంస్టెయిన్ చెప్పారు. ఇప్పటి వరకు గుర్తించిన దాదాపుగా 60 ముక్కల్లో 24 ఐఎస్ఎస్ కి ప్రమాదంగా పరిణమించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో భారత్ అంతరిక్షంలోని ఉపగ్రహాన్ని మిస్సైల్ తో ధ్వంసం చేసిందని ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ సామర్థ్యం అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఉండేది. మోడీ ప్రసంగం తర్వాత బ్రైడెంస్టెయిన్ ప్రకటన బయటికొచ్చింది. ఆయన నాసా సిబ్బందిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. 

ట్రంప్ ప్రభుత్వంలో భారత్ ఏశాట్ పరీక్షపై బహిరంగంగా మాట్లాడిన ఉన్నతాధికారి బ్రైడెంస్టెయిన్ మాత్రమే. భారత్ ఏశాట్ పరీక్షించడం చూసి ఇతర దేశాలు కూడా అలాంటి కార్యక్రమాలు చేపట్టే ప్రమాదం ఉందని అందోళన వ్యక్తం చేశారు.