చంద్రుడిపై నీటి అన్వేషణ.. వైపర్‌ రోవర్ ప్రయోగానికి సిద్ధం..!

చంద్రుడిపై నీటి అన్వేషణ.. వైపర్‌ రోవర్ ప్రయోగానికి సిద్ధం..!

చంద్రుడిపై నీరుందా..? ఉంటే... అది ఎక్కడుంది..? ఏ రూపంలో ఉంది? చాలా కాలంగా శాస్త్రవేత్తల  మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి. వీటికి సమాధానం చెప్పేందుకు కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది  అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. చందమామపై మనుషులు మనుగడ సాగించలంటే నీరు అవసరం. అయితే, అక్కడ నీరు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నా... అది ఎక్కడుంది..? ఏ రూపంలో ఉందన్నది మాత్రం ఇంత వరకూ  అంతుచిక్కలేదు. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఉన్న నీరు ఉండోచ్చని భావిస్తోంది నాసా. ఈ విషయాన్ని  నిర్ధారించుకోడానికి వైపర్‌గా పిలుస్తున్న వాలాటైల్స్‌ ఇన్వెస్టిగేటింగ్‌ పోలార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ రోవర్‌ను  పంపనుంది నాసా. 2022 డిసెంబర్‌లో వైపర్‌ను చంద్రుడిపైకి పంపాలని నిర్ణయించుకుంది. 

గోల్ఫ్‌ కార్ట్‌ పరిమాణంలో ఉండే వైపర్‌ను చంద్రుడిపైకి పంపాలన్న ప్రాజెక్టు కోసం 250 మిలియన్‌ డాలర్లను ఖర్చు చేస్తోంది నాసా. కమర్షియల్‌ ల్యాండర్‌ ద్వారా వైపర్ని చంద్రుడిపైకి పంపాలన్నది నాసా  ఆలోచన. వైపర్‌ వంద రోజుల పాటు పని చేస్తుంది. చీకట్లో కూడా పని చేసే విధంగా దీనిని సిద్ధం చేస్తున్నారు. వైపర్‌లో నాలుగు రకాల పరికరాలు ఉంటాయి. ఉపరితలం నుంచి మూడు అడుగులలోతు వరకూ తెలిచే సామర్థ్యం గల డ్రిల్‌ ఉంటుంది. అలాగే, ఉపరితలంపై గల పదార్థాలతో పాటు డ్రిల్‌ బయటకు తీసే  పదార్థాలను పరీక్షించడానికి 3 రకాల స్పెక్టో మీటర్లను వైపర్‌కు అమర్చుతారు. వైపర్‌ సేకరించే సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా చంద్రుడిపై ఏయే ప్రాంతాల్లో ఏమి ఉండొచ్చనే అంచనాకు వస్తారు  శాస్త్రవేత్తలు. చంద్రుడిపై నీరు ఘన రూపంలో ఉందని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. నీరు ఎక్కడుందో కనుక్కోగలిగితే...  పెద్ద ముందడుగే అవుతుంది. ఎందుకంటే... మనకు తాగేందుకు నీరు కావాలన్నా... పీల్చేందుకు ఆక్సీజన్‌  కావాలన్నా ఘనీభవించిన నీటి నుంచి తీసుకోవచ్చు. అలాగే, నీటిని ఆక్సీన్‌, హైడ్రోజన్‌గా విడదీస్తే... స్పేస్‌ షటిల్‌కు ఇంధనంగా ఉపయోగపడుతుంది. భూమి నుంచి వ్యోమగాముల్ని చంద్రుడికి  పంపేందుకు స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎల్‌ఎస్‌) రాకెట్లను ఉపయోగించాలని నాసా భావిస్తోంది.