నాసా టాయిలెట్ పోటీ... గెలిచిన వాళ్లకు...!!       

నాసా టాయిలెట్ పోటీ... గెలిచిన వాళ్లకు...!!       

అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా 2024 నాటికి చంద్రునిపై శాశ్వత నివాస స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం  అవుతున్న సంగతి తెలిసిందే.   ఆర్టెమిస్ మిషన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.  చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తిలో 1/6 వంతు ఉంటుంది.   ఈ కారణంగానే చంద్రుని ఉపరితలంపై చిన్న చిన్న వస్తువులు గాల్లో తేలుతుంటాయి.  

అందుకోసమే మనిషి బరువైన స్పెషల్ స్పేస్  సూట్ ను ధరించి చంద్రునిపై అడుగుపెట్టారు. ఇప్పటి వరకు చంద్రునిపై అడుగుపెట్టిన మనిషి, కొన్ని గంటలు మాత్రమే అక్కడ గడిపాడు.  చంద్రునిపై ఎన్నో పరిశోధనలు చేశారు.  ఇంకా చేయాల్సిన పరిశోధనలు చాలా ఉన్నాయి. అందుకోసమే  నాసా చంద్రునిమీద  శాశ్వత నివాస స్థావరాన్ని ఏర్పాటు  చేయాలని చూస్తున్నది.  అలా ఏర్పాటు చేస్తే మనిషి అక్కడే కొన్నాళ్లపాటు నివసించాల్సి ఉంటుంది.  

శాశ్వత నివాసం అంటే అందులో టాయిలెట్ తప్పనిసరిగా ఉండాలి.  ఈ టాయిలెట్ రూపకల్పన నాసాకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది.  భూమిపై ఉపయోగించే టాయిలెట్ ను అక్కడ ఉపయోగించలేరు.  కారణం, గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటమే.   చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి తగిన విధంగా టాయిలెట్ ను డిజైన్ చేయాల్సి ఉంటుంది.  అందుకే నాసా టాయిలెట్ పోటీని నిర్వహిస్తోంది.  చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా టాయిలెట్ ను డిజైన్ చేసిన వాళ్లకు  35వేల డాలర్ల ప్రైజ్ మనీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.  ఆసక్తిగల వ్యక్తులు ఆగష్టు 17 వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు డిజైన్లను పంపించాలని నాసా పేర్కొన్నది.