ఆటో నడుపుతున్న జాతీయ అవార్డ్ విజేత...

ఆటో నడుపుతున్న జాతీయ అవార్డ్ విజేత...

ఒకప్పుడు జాతీయ పేపర్ క్రాఫ్ట్ లో జాతీయ స్థాయి అవార్డ్ కైవసం చేసుకున్న ఆర్టిస్ట్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనగర్ కు చెందిన సయ్యద్ అలీ షా కుమారుడు సయ్యద్ అజాజ్ షా అద్భుతమైన పేపర్ క్రాఫ్ట్ కళాకారుడు. ఆయన ప్రతిభకు మెచ్చి కేంద్రం 2006 సంవత్సరానికి గాను ఆయనకు జాతీయ అవార్డ్ ప్రకటించింది.  2008 డిసెంబర్ 15న జాతీయ అవార్డును ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. అవార్డ్ అందుకున్న సమయంలో అజాజ్ షా ఆనందానికి అవదులు లేవు. 

కేంద్ర ప్రభుత్వం తన కళను ప్రోత్సహించేందుకు మరింత సాయం చేస్తుందని భావించాడు. ఆ కళతో పెద్దగా ఆదాయం రాకపోయినా కళపై ఉన్న అభిమానంతో కొనసాగించేవాడు. వచ్చిన అరకొర డబ్బుతోనే జీవనం సాగించేవాడు. అయితే... దురదృష్టం ఆయన వెంట పడింది. అజాజ్  పేపర్ కళను చూసి కాశ్మీర్ ప్రజలు  అబ్బుర పడేవారు. ముఖ్యంగా షాయిస్ ఎక్కువగా ఇష్టపడేవారు. 

అజాజ్ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆయన తండ్రికి బోన్ మ్యారో క్యాన్సర్ ఉందని తేలింది. ఆ వార్త విన్న అజాజ్ కుప్పకూలిపోయాడు. ఆయనకు వైద్యం చేయించటానికి డబ్బు ఎక్కడి తీసుకురావాలి. వచ్చిన కళతో సంపాదన ఏమి లేదు. అది కుటుంబ పోషణకే సరిపోవటం లేదు. వైద్యానికి ఖర్చు కోసం ప్రభుత్వం ఇచ్చిన అవార్డ్ అమ్ముకోవటం తప్ప .... వేరే మార్గం కనిపించ లేదు. దీంతో అజాజ్ తండ్రి వైద్యం కోసం జాతీయ అవార్డ్ ని అమ్మేశాడు. వైద్యం చేయించాడు. కానీ అతని తండ్రిని కాపాడుకోలేక పోయాడు అజాజ్.  

తండ్రి మరణం తర్వాత కళకు దూరమయ్యాడు. పేపర్ క్రాఫ్ట్ పనులు చేయటం మానుకున్నాడు. ఆయన భార్య బంగారు నగలు విక్రయించి వచ్చిన డబ్బుతో ఓ ఆటో రిక్షా కొన్నాడు. రోజు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే.. ఆ క్రాఫ్ట్ లో వచ్చిన ఆదాయం కంటే ఆటో నడుపుకోవటం వల్లే ఎక్కువ ఆదాయం వస్తుందని అజాజ్ చెబుతున్నాడు. ప్రస్తుతం రోజుకు రూ.700 నుండి రూ. 1000 సంపాదిస్తున్నాని తెలిపారు. గతంలో నెలకు కేవలం రూ. 6000 వేలు కూడా రావటం కష్టంగా ఉండేదని చెబుతున్నారు అజాజ్. అయితే... తన కూతురు పెరిగి పెద్దదవుతోంది. ఆటో రిక్షా నడపటంతో ఆమెకు పెళ్లి చేయటం కష్టమవుతుందని భావిస్తున్నాడు. ప్రభుత్వాలు కళాకారులను ప్రోత్సహిస్తాం అంటూ మాటలు చెబుతోంది కానీ.... చేతల్లో మాత్రం చేయటం లేదు. దీంతో కళాకారులు రోడ్డున పడుతున్నారు.