తెలంగాణ ప్రభుత్వం అనుమతితో బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం ప్రారంభం...

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం ప్రారంభం...

ఈ రోజు నుండి హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో 8 ఒలింపిక్ అథ్లెట్ల కోసం బ్యాడ్మింటన్ జాతీయ శిక్షణ శిబిరాన్ని తిరిగి ప్రారంభించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఆగస్టు 5 న తెలంగాణ ప్రభుత్వం నుండి శిక్షణ శిబిరానికి క్లియరెన్స్ వచ్చిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అకాడమీలో శిక్షణను తిరిగి ప్రారంభించే 8 మంది అథ్లెట్లు పివి సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, సాయి ప్రణీత్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయి రాజ్ అలాగే ఎన్ సిక్కి రెడ్డి.

అయితే ఈ శిక్షణ సమయంలో అథ్లెట్ల పూర్తి భద్రత అలాగే సామాజిక దూర నియమాల కోసం అకాడమీని కలర్ జోన్లుగా విభజించారు, ఇందులో అథ్లెట్ మరియు కోచ్‌లు మాత్రమే గ్రీన్ జోన్ లోకి అనుమతించబడతారు, సహాయక సిబ్బంది మరియు పాలన సిబ్బందికి ప్రవేశం ఉండదు. శిక్షణ ప్రారంభం గురించి పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ... ''ఈ సుదీర్ఘ విరామం తరువాత మా షట్లర్లను తిరిగి ఆన్-ఫీల్డ్ శిక్షణ కోసం తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. సురక్షితమైన వాతావరణంలో శిక్షణను తిరిగి ప్రారంభించడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము'' అని తెలిపారు.