ఆర్సెలార్ మిట్టల్ ఎస్సార్ స్టీల్ కొనుగోలు ప్రక్రియకు ఎన్సీఎల్టీ ఆమోదం

ఆర్సెలార్ మిట్టల్ ఎస్సార్ స్టీల్ కొనుగోలు ప్రక్రియకు ఎన్సీఎల్టీ ఆమోదం

ఎస్సార్ స్టీల్ ను ఆర్సెలార్ మిట్టల్ కొనుగోలు ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపింది. రాయిటర్స్ వార్తాసంస్థ తన టీవీ చానెల్ ద్వారా ఈ సమాచారం తెలియజేసింది.

అప్పుల్లో కూరుకుపోయిన ఎస్సార్ స్టీల్ ను రూ.42,000 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఆర్సెలార్ మిట్టల్ బిడ్ వేసింది. దీనికి పోటీగా ప్రమోటర్ రుయీల కుటుంబం మరో బిడ్ వేశారు.

గత ఏడాది అక్టోబర్ లో ఎస్సార్ స్టీల్ కి అప్పులు ఇచ్చిన రుణదాతల కన్సార్టియం ఆర్సెలార్ మిట్టల్ బిడ్ కు తమ ఆమోదం తెలియజేశాయి. మిట్టల్ ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు రూ.42,000 కోట్లకు బిడ్ వేశారు.

కంపెనీ ప్రమోటర్లు రుయీల కుటుంబం దీనికి పోటీగా రూ.54,384 కోట్లకు బిడ్ చేశారు. దీనిని రుణదాతలు, వేలం ప్రక్రియను పర్యవేక్షిస్తున్న బృందం తిరస్కరించింది.

వేలం ప్రక్రియను మార్చి 8 కల్లా పూర్తి చేయాలని నేషనల్ కంపెనీ అప్పిలేట్ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ కు సూచించింది.

ఆర్సెలార్ మిట్టల్ వేసిన బిడ్ లో ఎస్సార్ స్టీల్ లోని రూ.8,000 కోట్ల పెట్టుబడిని వేరుగా లెక్కగట్టే వెసులుబాటు కూడా ఉంది.

ఎస్సార్ స్టీల్ గుజరాత్ లోని హజీరాలో కోటి టన్నుల సామర్థ్యం గల స్టీల్ ప్లాంట్ ను నిర్వహిస్తోంది. కంపెనీపై 12కి పైగా బ్యాంకులు ఇచ్చిన సుమారు రూ.49,000 కోట్ల రుణభారం ఉంది. జూన్ 2017 తర్వాత కంపెనీ దివాలా ప్రక్రియలోకి వెళ్లిపోయింది.