జాతి భద్రతే మాకు ముఖ్యం: అమిత్ షా

జాతి భద్రతే మాకు ముఖ్యం: అమిత్ షా

జాతి భద్రతే బీజేపీకి ముఖ్యమని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా స్పష్టం చేశారు. ఆదివారం ఆయన హర్యానాలోని పానిపత్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని.. కానీ జాతి భద్రత విషయంలో బీజేపీ వెనకడుగు వేయదని అన్నారు. బీజేపీ మరో సారి అధికారంలోకి వస్తే దేశంలో ఉన్న చొరబాటుదారులను దేశం నుంచి బయటకు వెళ్లగొడతామని తెలిపారు. కాశ్మీర్‌కు మరో ప్రధాని కావాలని ఒమర్‌ అబ్దుల్లా అడుగుతున్నారని, రాహుల్‌ ఈ డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నారా? లేదా? ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు. దేశం నుంచి కాశ్మీర్‌ను విడగొట్టాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని, బీజేపీ ఉన్నంతవరకు అది జరగదన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ను రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఐదేళ్లు దేశానికి భద్రత కల్పించినందుకు మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన ఓటర్లను కోరారు.

‘పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌ భూభాగంలోకి వెళ్లి మరీ మన సైనికులు ప్రతీకారం తీర్చుకున్నారు. కానీ ప్రతిపక్షాలు ఈ దాడికి  సాక్ష్యాలు అడగడం విడ్డూరంగా ఉంది. బాలాకోట్‌ ఘటన జరిగిన నాడు అందరూ వేడుకలు జరుపుకున్నారు. కానీ పాకిస్థాన్‌లో, రాహుల్‌ గాంధీ కార్యాలయంలో మాత్రం ఎలాంటి సంబరాలు లేవు. పాక్‌ ఉగ్రవాదులను చంపితే కాంగ్రెస్ కు ఎందుకు బాధ. వారేమైనా మీకు బంధువులా? బాలాకోట్‌ ఘటనపై మీకు అంత అనుమానంగా ఉంటే పాక్‌ టీవీ ఛానళ్లు చూడాలి. అక్కడ ప్రజలు ఎందుకు బాధపడుతున్నారో, ఆరోజు అక్కడ ఏం జరిగిందో మీకే అర్థమయ్యేది' అని అమిత్ షా అన్నారు.