నేటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీనివాసుడి నవరాత్రి  బ్రహ్మోత్సవాలకు ఆరంభ సూచికగా నిన్న రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సంపంగి ప్రాకారంలో వైఖాన‌స ఆగ‌మోక్తంగా అంకురార్పణ ఘ‌ట్టం నిర్వహించారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి స్వామివారి సేనాధిప‌తి విష్వక్సేనుడిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. న‌వ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు. 

బ్రహ్మోత్సవాలు జరిగే తోమ్మిది రోజులు పాటు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పుట్టుమన్నులో నవధాన్యాలు ఎంత బాగా అంకురిస్తాయో... రాష్ర్టం అంత సుభిక్షంగా వుంటుందని భక్తుల విశ్వాసం. కరోనా ప్రభావం కారణంగా ఆలయంలోనే బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వాహన సేవలను సైతం కల్యాణ మండపంలోనే కొలువుదీర్చనున్నారు. ఇవాళరాత్రి పెదశేష వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక ప్రవేశదర్శనం, కల్యాణోత్సవం, శ్రీవాణి ట్రస్టు టికెట్లు కలిగిన భక్తులనే అనుమతిస్తారు.