తెలంగాణ ఇసుక పాలసీ సూపర్… మా రాష్ట్రంలో అమలు చేస్తాం!

తెలంగాణ ఇసుక పాలసీ సూపర్… మా రాష్ట్రంలో అమలు చేస్తాం!
తెలంగాణ ఇసుక పాలసీపై ప్రశంసలు కురిపించారు పంజాబ్ మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ… ఇది దేశంలోనే అత్యుత్తమ పాలసీఅని ఆయన కితాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రేటు నిర్ణయం చేయడం వల్ల సామాన్యులకు లబ్ధి చేకూరుతుందన్న సిద్ధు… పాలసీ అమలులో చిన్న చిన్న సమస్యలు ఉన్నా… విధానం మాత్రం సూపర్ అని… ఇదే విధానాన్ని పంజాబ్‌లో అమలు చేయాలనే ఆలోచన కూడా ఉందన్నారు. అక్రమాలు అరికట్టడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని… ఆదాయం ఎన్నో రెట్లు పెరిగిందని తెలంగాణ సాండ్ పాలసీ నిరూపించిందన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ మంత్రి… రెండు నదులు ఉన్న తెలంగాణలో ఇసుక రాబడి రూ.1,300 కోట్లు ఉంటే… మరి నాలుగు నదులున్న పంజాబ్ రాబడి ఎంత ఉండొచ్చో అర్థం అవుతుందన్నారు. కాంగ్రెస్ వ్యక్తిగా కాదు… తాను భారతీయునిగా మాత్రమే తెలంగాణ ఇసుక విధానంపై మాట్లాడుతున్నానన్నారు సిద్ధు… క్రికెటర్‌గా, వ్యాఖ్యాతగా నేను ఎంతో సేవ చేసినా… రాజకీయాలంటేనే తనకు అత్యంత ఇష్టమన్న ఈ మాజీ క్రికెటర్… రాజకీయలను ఒక ప్రొఫెషనల్ గా కాకుండా ఒక మిషన్ గా భావిస్తానని చెప్పుకొచ్చారు. ప్రజల జీవితాలను మార్చే విధంగా రాజకీయాలు ఉండాలని కోరుకుంటానన్నారు సిద్ధు. అయితే సిద్ధు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడం లేదు… ఇప్పటికే ఇసుక పాలసీపై తీవ్రస్థాయిలో టి.కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూ వస్తుండగా… మరో రాష్ట్రానికి చెందిన తమ పార్టీకి చెందిన మంత్రే… ఆ పాలసీపై ప్రశంసలు కురిపించడంపై గుర్రుగా ఉన్నారు. సిద్ధుపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.