టీవీ9 రవిప్రకాష్ పిటిషన్ పై స్టే

టీవీ9 రవిప్రకాష్ పిటిషన్ పై స్టే

నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యూనల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌లో టీవీ9 మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) రవి ప్రకాష్‌, తదితరులు వేసిన పిటీషన్‌పై ఢిల్లీలోని నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌ స్టే విధించింది. అసోసియేట్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏబీసీఎల్‌) పై రవి ప్రకాష్‌తోపాటు మరో ఇద్దరు పిటీషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఇవాళ హైదరాబాద్‌లో రవిప్రకాష్‌ పిటీషన్‌ విచారణకు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని అప్పిలేట్‌  ట్రైబ్యూనల్‌ను అలందా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  ఆశ్రయించింది. ఏబీసీఎల్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసిన అలందా మీడియా తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ సుదీప్తో సర్కార్‌ తో మరో ఆరుగురు లాయర్లు వాదించారు. అలందా వాదనలు విన్న అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌  రవి ప్రకాష్‌ పిటీషన్‌పై స్టే విధిస్తూ... అలందా పిటీషన్‌ విచారణకు స్వీకరించింది. అలందా వేసిన పిటీషన్‌పై మే 20వ తేదీలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా రవిప్రకాష్‌, తదితరులకు నోటీసులు జారీ చేస్తూ కేసు విచారణను జులై 9కి వాయిదా వేసింది. ఢిల్లీ అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌ ఉత్తర్వులను హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీకి అలందా ప్రతినిధులు అందజేశారు. దీంతో కేసు విచారణకు రాకుండానే వాయిదా పడింది. 
మరోవైపు సింగపూర్‌కు చెందిన సయీఫ్‌ పార్టనర్స్‌కు చెందిన పిటీషన్‌పై వెంటనే ముగించాలని కూడా హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌కు ట్రైబ్యూనల్‌ ఆదేశించింది. తనకు రావాల్సిన బకాయి కోసం ఏబీసీఎల్‌పై సయీఫ్‌ పార్టనర్స్‌ ఎన్‌సీఎల్‌టీలో కేసు వేసింది. రుణం ఇచ్చేందుకు ఏబీసీఎల్‌ అంగీకరించడంతో  కేసు ముగించాల్సిందిగా సయీఫ్‌ వేసిన పిటీషన్‌ హైదరాబాద్‌ బెంచ్‌లో విచారణలో ఉంది. ఈ కేసు నుంచి సయీఫ్‌ పార్టనర్‌  తన పిటీషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని,  ఒకవేళ పిటీషన్‌ తిరస్కరించే పక్షంలో కారణాలు చూపాలని పేర్కొంటూ... ఈ కేసుకు సంబంధించి మళ్ళీ తాత్కాలిక ఆదేశాలు ఇవ్వొద్దని ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ను  అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌ ఆదేశించింది. దీంతో సయీఫ్‌ పిటీషన్‌పై హైదరాబాద్‌ బెంచ్‌లో శుక్రవారం విచారణ జరగనుంది. అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ బెంచ్‌ తుది నిర్ణయం ప్రకటించనుంది.