అమ్మకానికి ల్యాంకో ఇన్‌ఫ్రా .... అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ

అమ్మకానికి ల్యాంకో ఇన్‌ఫ్రా .... అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ

ల్యాంకో ఇన్‌ఫ్రా లిక్విడేషన్ కు రంగం సిద్ధమైంది.  బ్యాంకు రుణ బకాయిలను చెల్లించకపోవడంతో లిక్విడేషన్‌కు అనుమతిస్తూ సోమవారం జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. రుణాలను చెల్లించి తాము నిర్వహణ చేపడతామని పలు కంపెనీలు వివిధ రకాల ప్రణాళికలు సమర్పించినా.. రుణదాతల కమిటీ ఆమోదించకపోవడంతో క్విడేషన్‌ తప్పనిసరిగా మారింది.ఇంటెరిమ్‌ రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ (ఐఆర్‌పి) సావన్‌ గొడియావాలాను అఫీషియల్‌ లిక్విడేటర్‌గా నియమిస్తూ ఎన్‌సిఎల్‌టి, హైదరాబాద్‌ బెంచ్‌ జుడిషియల్‌ మెంబర్‌ రాటకొండ మురళి ఆదేశాలు జారీ చేశారు. ఇంటెరిమ్‌ రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ (ఐఆర్‌పి) సావన్‌ గొడియావాలాను అఫిషియల్‌ లిక్విడేటర్‌గా నియమిస్తూ ఎన్‌సిఎల్‌టి బెంచ్‌ జుడిషియల్‌ మెంబర్‌ రాటకొండ మురళి ఆదేశాలు జారీ చేశారు. దీంతో లాంకో ఇన్ ఫ్రా లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.  కంపెనీ మూసివేత ప్రక్రియపై త్వరలోనరే బహిరంగ ప్రకటన జారీ కానుంది.  

బోర్డు రద్దు
ప్రస్తుత కంపెనీ బోర్డుతో పాటు ఇతర మేనేజ్‌మెంట్‌, భాగస్వాముల అధికారాలను రద్దు చేస్తూ వాటన్నింటినీ లిక్విడేటర్‌కు బదలీ చేస్తూ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. లిక్విడేషన్‌ ప్రారంభమైన 75 రోజుల్లో ప్రాథమిక నివేదికను అడ్జుడికేటింగ్‌ అథారిటీకి సమర్పించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. తనకు రావాల్సిన రూ.3608 కోట్ల బకాయిలను చెల్లించకపోవడంతో దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలంటూ ఐడీబీఐ బ్యాంకు దాఖలు చేసింది. మొత్తం అన్ని బ్యాంకులు, రుణదాతలకు కలిపి రూ.49,959 కోట్ల రావాల్సి ఉందని పేర్కొనగా, రూ.47,721 కోట్లు రుణ బకాయిలున్నట్లు ల్యాంకో ఇన్‌ఫ్రా అంగీకరించింది. ఐడీబీఐ దరఖాస్తుపై విచారించిన ట్రైబ్యునల్‌ కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్‌ ప్రాసెస్‌ (సీఐఆర్‌పీ)కి అనుమతిస్తూ 2017 ఆగస్టు 7న ఉత్తర్వులు జారీ చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియ నిపుణుడిగా శావన్‌ గొడియావాలను నియమించింది.  ఈ ఏడాది జనవరిలో మరో 90 రోజులు పొడిగించగా అది కూడా మే 4తో ముగిసింది. ల్యాంకో ఇన్‌ఫ్రా రుణపరిష్కార ప్రణాళికను సమర్పించడానికి ప్రకటన జారీ చేయగా 7 కంపెనీలు ఆసక్తి చూపాయి. కాని అవి సమర్పించిన ప్రణాళికలు రుణదాతల కమిటీ ఆమోదం తెలుపలేదు.

మళ్ళీ ప్రక్రియ ప్రారంభానికి నో
దివాలా పరిష్కార ప్రక్రియలో పాల్గొనే కంపెనీల అర్హతలకు సంబంధించిన ఇటీవల చట్ట నిబంధనను ప్రభుత్వం సవరించిన నేపథ్యంలో ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవహారంపై కార్పొరేట్‌ దివాలా ప్రక్రియను తాజాగా చేపట్టాలని కోరుతూ పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన దరఖాస్తును  బెంచ్ సోమవారం తిరస్కరించింది.  ల్యాంకో ఇన్‌ఫ్రాకు సంబంధించి దాఖలైన ఇతర దరఖాస్తులపై విచారణ సెప్టెంబరు 12వ తేదీకి వాయిదా వేశారు.