'మహా' హైడ్రామా.. ఇవాళ కీలక భేటీ.. తెరపడుతుందా..?

'మహా' హైడ్రామా.. ఇవాళ కీలక భేటీ.. తెరపడుతుందా..?

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో  హైడ్రామా నడుస్తోంది. శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంపై..కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య మంతనాలు సాగుతున్నాయి. ఆ రెండు పార్టీల ముఖ్యనాయకులు ఇవాళ ఢిల్లీలో సమావేశం  కానున్నారు. ఇప్పటికే శరద్‌ పవార్.. సోనియాగాంధీతో సమావేశమై.... కనీస ఉమ్మడి  ప్రణాళికపై ఇరువురు చర్చించారు. ప్రభుత్వ  ఏర్పాటు విషయంలో శివసేనతో సంప్రదింపులకు ముందు... కామన్ మినిమం ప్రోగ్రామ్‌కు తుదిరూపు తీసుకురావాలని ఎన్సీపీ-కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్‌ చేజారిన పరిస్థితుల దృష్ట్యా, మహారాష్ట్ర  విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. నిబద్ధతతో వ్యవహరించాలని సొంత పార్టీ నేతలకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.

శివసేనతో జట్టుకట్టే విషయమై కొన్ని రోజులుగా కాంగ్రెస్‌-ఎన్సీపీ మధ్య ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ఓ సారి మద్దతిస్తామని... మరోసారి లేదంటూ పవార్ శివసేనను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నారు. సేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే... ముందుగా తమ భాగస్వామి కాంగ్రెస్‌తో ఓ అభిప్రాయానికి రావాల్సిన అసరముందని చెబుతున్నారు శరద్ పవార్. ఇక, శరద్ భిన్నమైన కామెంట్‌లు శివసేనకు తలనొప్పిగా మారాయి. పవార్‌ వ్యాఖ్యలు అర్థం చేసుకోవాలంటే వంద జన్మలెత్తాలని అన్నారు శివసేన నేత సంజయ్ రౌత్. ఎన్సీపీతో పొత్తు గురించి ఎవరూ బెంగ పెట్టుకోవద్దన్నారు సంజయ్ రౌత్. డిసెంబరు ఆరంభంలోనే మహారాష్ట్రలో శివసేన సారథ్యంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తంచేశారు. అదే సమయంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాకు బీజేపీ ఒప్పుకొని ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తే... వారితో సంతోషంగా కలుస్తామని పార్టీ  వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న శివసేన ప్రయత్నం సాధ్యపడలేదు. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేకపోవడంతో గవర్నర్ సిఫారసు మేరకు.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.