ఎన్డీఏకి 274.. యూపీఏకి 164

ఎన్డీఏకి 274.. యూపీఏకి 164

దేశవ్యాప్తంగా ఎన్డీఏ వ్యతిరేకత పెరుగుతోందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ కూటమి అధికారంలోకి వస్తుందా? అంటే.. ఎన్డీఏకి మరో  మరో అవకాశం ఇవ్వరాదని కోరుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది అని ఏబీజీ-సీఎస్‌డీఎస్‌ సర్వే చెబుతోంది. తక్షణం ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 274, యూపీఏ కూటమికి 164, ఇతరులకు 105 సీట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది. నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో వెలువడ్డ ఈ సర్వే బీజేపీకి ముఖ్యంగా కేంద్ర నేతలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఓట్ల శాతం బట్టి చూస్తే ఎన్డీఏకి 37 శాతం, యూపీఏకి 31 శాతం, ఇతరులకు 32 శాతం లభిస్తాయని ఈ సర్వే అంచనా వేస్తోంది. మోడీ ప్రభ కూడా నానాటికీ తగ్గుతోంది. 2017 మేలో మోడీ ప్రజాకర్షణ శక్తి 37శాతం ఉండగా ఇప్పుడు 34 శాతానికి చేరింది. రాహుల్‌గాంధీ ప్రజాకర్షణ శక్తి 16 నుంచి 24 శాతానికి చేరింది. ఈ సర్వే ప్రకారం.. దక్షిణాదిలోని 132 సీట్లలో ఎన్డీఏకి 18-22, యూపీఏకి 67-75 ఇతరులకు 38-44 సీట్లు రావొచ్చు. ఉత్తరాదిన ఉన్న 151 సీట్లలో ఏన్డీఏకి 90, యూపీఏకి 25, ఇతరులకు 36 సీట్లు లభించొచ్చ. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేస్తే బీజేపీకి ఇబ్బందులు తప్పవని సర్వే చెబుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపీలో ఎన్డీఏకి 35 శాతం, ఎస్పీ-బీఎస్పీ కూటమికి 46 శాతం ఓట్లు లభించవచ్చు. ఇక.. మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో ఎన్డీఏకి 48 శాతం, యూపీఏకి 40 శాతం, ఇతరులకు 21 శాతం ఓట్లు రావోచ్చు.