ఎట్టకేలకు  బోటు తొలగించారు !

ఎట్టకేలకు  బోటు తొలగించారు !

 

ప్రకాశం బ్యారేజీలో కొద్ది రోజులుగా అడ్డంకిగా మారిన బోటును ఎట్టకేలకు బయటకు తీశారు. 68వ గేటు మధ్యలో ఇరుక్కున్న ఆ బోటును బోట్స్ రెస్క్యూ స్పెషలిస్ట్ టీమ్ ఆధ్వర్యంలో తొలగించారు. గత ఐదు రోజులుగా శ్రమించిన నిపుణుల బృందం ఈరోజు ఆ పడవను గేటు నుంచి తొలగించింది. పడవకు రంద్రాలు చేసి ఇనుపతాడు సాయంతో బయటకు లాగారు. ఈ ఇరుక్కున్న పడవను బయటకు లాగేందుకు కాకినాడ, బళ్లారి, పులిచింతల, బైరవానితిప్ప నుండి స్పెషల్ టీమ్ లు ప్రయత్నాలు చేశాయి. కృష్ణానదికి వరద పోటెత్తిన సమయంలో ప్రకాశం బ్యారేజీ గేటు వద్ద ఈ పడవ చిక్కుకుంది.

వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత అన్ని గేట్లను మూసివేసినప్పటికీ పడవ అడ్డుగా ఉండటంతో సదరు గేటు మూసివేత కుదరలేదు. ఫలితంగా పెద్ద మొత్తంలో నీరు వృథాగా కిందికి పోయింది. నిన్న ఈ గేటు తొలగించే క్రమంలో నీటిని పక్కకి పంపడానికి పక్కనున్న గేట్లు తెరవడంతో ఒక వృద్దుడు కూడా చనిపోయాడు. ఇక బయటకి తెచ్చిన బోటు బరువు 14 టన్నుల వరకు ఉందని అంచనా. అయితే బ్యారేజీ గేట్లకు ఎలాంటి నష్టం లేకుండా బోటును తొలగించిన రెస్క్యూ సిబ్బందిని అధికారులు అభినందించారు.