ఆర్టికిల్ 370, 35-ఏలని సమీక్షించాలి

ఆర్టికిల్ 370, 35-ఏలని సమీక్షించాలి

జమ్ముకశ్మీర్ కి ప్రత్యేక స్థాయిని ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికిల్ 370, ఆర్టికిల్ 35-ఏలను సమీక్షించాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రమైన జమ్ముకశ్మర్ ని ఈ రాజ్యాంగ నిబంధనల వల్ల ప్రయోజనం చేకూరిందా లేదా నష్టం వాటిల్లిందా తెలుసుకోవాలంటే ఇది తప్పనిసరని రాజ్ నాథ్ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల కోసం ప్రకటించిన బీజేపీ మేనిఫెస్టోలో ఆర్టికిల్ 370, ఆర్టికిల్ 35-ఏలను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారం సందర్భంగా పదేపదే తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే ఈ అధికరణలను రద్దు చేస్తామని చెబుతూ వచ్చారు. ఇప్పుడు రాజ్ నాథ్ ప్రకటన సంచలనం కలిగిస్తోంది. 

జమ్ముకశ్మీర్ లో శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి ప్రత్యేకాధికారాలు ఉన్నాయని కేంద్ర హోమ్ మంత్రి చెప్పారు. లోక్ సభ ఎన్నికలు ముగియగానే అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వస్తుందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. 370, 35-ఏ అధికరణలకు ముగింపు పలికితే కశ్మీర్ సమస్య పరిష్కారానికి దోహదపడుతుందని బీజేపీ భావిస్తోందా? అన్న ప్రశ్నకు ఈ అధికరణలతో కశ్మీర్ లాభపడిందా? నష్టపోయిందా? అనే విషయంపై సమీక్షించాల్సి ఉందని అన్నారు. 

బీజేపీ మద్దతుతోపీడీపీ నాయకత్వంలో ఏర్పాటైన జమ్ముకశ్మీర్ ప్రభుత్వానికి బీజేపీ అకస్మాత్తుగా మద్దతు ఉపసంహరించడంతో గత ఏడాది జూన్ 19న జమ్ముకశ్మీర్ లో గవర్నర్ పాలన కొనసాగుతోంది. గవర్నర్ సత్యపాల్ మలిక్ నవంబర్ 21న శాసనసభను రద్దు చేశారు. ఎమ్మెల్యేల బేరసారాలు అడ్డుకొనేందుకు శాసనసభను రద్దు చేసినట్టు మలిక్ చెప్పారు. గవర్నర్ పాలన ఆర్నెల్ల తర్వాత డిసెంబర్ 19, 2018న ఆర్నెల్ల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. మే 19న రాష్ట్రపతి పాలనను మరోసారి పెంచాల్సి ఉంది.