తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన నీలం సహానీ

తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన నీలం సహానీ

నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నుంచి సహానీ ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇప్పటివరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆమె 1984 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణి. గతంలో  నీలం సహానీ కృష్ణాజిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించి, అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లారు. గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా, అనంతరం ఏపీఐడీసీ వీసీ అండ్‌ ఎండీగా బాద్యతలు నిర్వహించి, ఆ తర్వాత స్త్రీ శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగానూ పనిచేశారు.

గతేడాది నుంచి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాద్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది కోసం పనిచేస్తానని, "నా మొదటి పోస్టింగ్ కృష్ణా జిల్లా మచిలపట్నంలోనే, మళ్లీ తిరిగి ఏపీకి వచ్చి పని చేయడం చాలా ఆనందంగా ఉంది, ఈ రాష్ట్రం నాకు చాలా నేర్పింది, నా ప్రయాణం ఇక్కడి నుంచే మొదలై మళ్లీ ఇక్కడికే వచ్చా"నని పేర్కొన్నారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సతీనాయర్‌, మిన్నీ మాథ్యూ ప్రభుత్వ మహిళా ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వర్తించారు.